ఆస్ట్రేలియా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : NRI అమరేందర్ రెడ్డి లైఫ్ జెర్నీ

0
97

నా పేరు ఊట్కూరి అమరేందర్ రెడ్డి. 2008 ఏప్రిల్ 10 నాడు రాత్రి 8 గంటలకు సిడ్నీ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగిన. నన్ను పిక్ చేసుకోవడానికి రావాల్సిన దోస్తులు ఎయిర్ పోర్ట్ కు రాలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను అప్పటి వరకు హైదరాబాద్ తప్ప ఇంకో సిటీ కానీ, ఇంకో దేశం కానీ ఎరగను. ఫ్లైట్ ఎక్కడం కూడా అదే ఫస్ట్ టైం. నేను వెళ్లాల్సిన రూమ్ అడ్రస్, ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు మాత్రం నాదగ్గర ఉన్నాయి. ఫోన్ చేయడానికి నాదగ్గర ఆస్ట్రేలియన్ కాయిన్స్ కూడా లేవు. అప్పుడు ధైర్యం చేసి అక్కడ ఒక ఆస్ట్రేలియన్ కు నా స్టోరీ అంతా చెప్పిన. అతడు తన మొబైల్ ఇచ్చి ఫోన్ చేసుకో అన్నాడు. అప్పుడు మా ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తే వాళ్ల సమాధానం ఏంటంటే… నువ్వు రేపు కదా వచ్చేది అన్నారు. సరే కానీ ఇప్పుడేం చేయాల్రా అని అడిగిన. ట్యాక్సీలో రా అని సమాధానం వచ్చింది. అప్పుడు ఆ ఆస్ట్రేలియన్ ను ట్యాక్సీ స్టాండ్ వద్దకు తోల్కపోయిండు. ఆ సమయంలో అతడు నాకు దేవుడిలా కనిపించిండు. అతనికి థాంక్స్ చెప్పి ట్యాక్సీ ఎక్కిన. గంటన్నర జెర్నీ తర్వాత మా ఫ్రెండ్స్ ఉండే రూమ్ కు చేరుకున్న. ట్యాక్సీవాలా నా సామాన్లు రూమ్ లో పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయాడు. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేద్దామని స్టూడెంట్ వీసాతో సిడ్నీల అడుగుపెట్టిన నా జెర్నీ… అలా మొదలైంది.

నెక్ట్ డే కాలేజీలో నా ఎన్ రోల్ మెంట్. నా ఫ్రెండ్ శ్రీనివాస్ కాలేజీకి తీస్కపోయిండు. కాలేజీలో ఎన్ రోల్ అయినంక సిమ్ కార్డు కూడా ఇప్పించాడు. మరుసటిరోజు నుంచి పార్ట్ టైం జాబ్ వేట మొదలుపెట్టాను. నేను 500 ఆస్ట్రేలియన్ డాలర్లు మాత్రమే వెంట తెచ్చుకున్నాను. కానీ ట్యాక్సీకే 80 డాలర్లు ఒడిసిపోయినయ్. అప్పట్లో పార్ట్ టైం జాబ్ దొరుకుడు చాలా కష్టంగా ఉండే. చేతిలో డబ్బులు అయిపోయినయ్. ఇంట్లో అడుగుదామంటే ఏమనుకుంటారో అనుకుని ఫ్రెండ్స్ ను అడిగిన. అప్పటికే ఆస్ట్రేలియాలో ఉండే ఒక ఫ్రెండ్ సామ అమరేందర్ రెడ్డి, ఐర్లాండ్ లో ఉండే మహేందర్ రెడ్డి మనీ సెండ్ చేశారు. మా రూమ్ రెంట్ వారానికి 60 డాలర్లు. మూడున్నర నెలల తర్వాత శ్రీలంక తమిళుల సంస్థ అయిన ఉదయ సూపర్ మార్కెట్ లో జాబ్ వచ్చింది. కానీ తర్వాత నా కాలేజ్ దోస్తు అయిన సునీల్.. తాను వర్క్ చేసే రెస్టారెంట్ లో జాబ్ ఇప్పించాడు. ఇలా ఒకవారం రెండు జాబులు చేసినంక ఒక మంచి ఉద్యోగం వచ్చింది.

ఉదయ సూపర్ మార్కెట్ వదిలేసి కోల్స్ (coles) సూపర్ మార్కెట్ లో మరియు రెస్టారెంట్ లో రెండు జాబ్స్ చేస్తూ కాస్త సెటిల్ అయ్యాను. కాలేజ్ ఫీజు మరియు రూమ్ రెంట్లకు వచ్చే సంపాదన సరిపోయేది. చూస్తుండగానే వీసా టైం అయిపోయింది. ఎక్స్ టెన్షన్ కోసం మిగిలిన సబ్జెక్టులతోపాటు మరొక కోర్సులో చేరి వీసా అప్లై చేశాను. రెండు వారాల్లో వీసా వచ్చింది. నేను ఇక్కడ చదివిన కోర్సు హోటల్ మేనేజమెంట్. వీసా వచ్చినాక ఒకసారి ఇండియా వచ్చి వెళ్లాను. అలా మరో ఏడాదిన్నర గడిచింది. నా కోర్సు పూర్తయ్యేసరికి నా కోర్సును పిఆర్ (permanent residency) లిస్టులోంచి తీసేసింది ఆస్ట్రేలియా సర్కారు. వీసా ఎక్స్ టెన్షన్ కోసం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాను. వీసా అప్లై చేస్తే అది రిజెక్ట్ అయింది. అప్పుడు కోర్టులో కేసు వేశాను. కేసు ఓపెన్ అయ్యేందుకు 2 ఏళ్లు పడుతుందని తెలుసు. అది ఓడిపోయే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కూడా తెలుసు. ఆలోపు ఎంతో కొంత సంపాదించుకుని ఇండియా వెళ్లిపోదామనుకున్నాను. ఆ టైంలోనే మ్యారేజ్ అయింది. మా వైఫ్ ఫ్యామిలీకి నా పరిస్థితులన్నీ డిటైల్డ్ గా చెప్పిన. అయినా వారు మ్యారేజ్ కి ఒప్పుకున్నరు.

 

నేను ఆస్ట్రేలియాకే ఎందుకొచ్చానంటే…?

అసలు నేను ఆస్ట్రేలియా రావడానికి కారణం ఐర్లాండ్ లో ఉండే ఫ్రెండ్ మహేందర్ రెడ్డి కారణం. వాడి వల్లే నేను ఆస్ట్రేలియా వచ్చిపడ్డాను. అప్పుడు అతడు ఐర్లాండ్ లో ఉండేవాడు కాబట్టి నేను కూడా ఐర్లాండ్ పోవాలనుకున్న. కానీ ఆస్ట్రేలియా బెటర్ అని, వీసా త్వరగా వస్తుందని, హోటల్ మేనేజ్ మెంట్ స్టడీ ఆస్ట్రేలియాలోనే బాగుంటుందని మహేందర్ సజెస్ట్ చేయడంతో ఇక్కడికి వచ్చిన. నాకు మహేందర్ రెడ్డి బాగా హెల్ప్ చేశాడు.

ఏడాదిన్నర ‘‘కుకరీ’’ కోర్సును నేను రెండేళ్లకు పూర్తి చేసిన. ఆరు నెలల పాటు ఎందుకు ఎక్కువ సమయం పట్టిందటే.. కంప్యూటర్ నాలెడ్జి లేకపోవడం వల్ల. చదువు అయిపోగానే.. రెజిమ్ లు పట్టుకుని తిరుగుడు స్టార్ట్ చేసిన ఉద్యోగం కోసం. మూడున్నర నెలలు తిరిగినంక ఉదయ స్పైసెస్ సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ దొరికింది. శ్రీలంక తమిళులది ఆ సూపర్ మార్కెట్. కానీ అందులో వారం మాత్రమే ఉద్యోగం చేసిన. గంటలకు 8 డాలర్ల చొప్పున ఇచ్చారు. వారంలో 16 గంటలు చేసిన.

తర్వాత కోల్స్ సూపర్ మార్కెట్ (coles) లో జాబ్ దొరికింది. ఇది చాలా పెద్ద కంపెనీ. నెల తర్వాత ఇండియన్ రెస్టారెంట్ లో జాబ్ వచ్చింది. తర్వాత శ్రీనివాస్ రూమ్ నుంచి నేను సునీల్ రూమ్ కు షిఫ్ట్ అయ్యాను. సునీల్ నా కాలేజ్ మెట్. మేము ఇద్దరమే తెలుగు వాళ్లం ఉండేవాళ్లం కాలేజీలో. నాకంటే చాలారోజుల ముందే సునీలో సిడ్నీ వచ్చాడు. నేను ఇటు రాగానే శ్రీను వేరే ప్లేస్ కు షిఫ్ట్ అయ్యాడు.

వీసా రిజెక్ట్ కావడం… నేను కేసు వేయడం… ఈ క్రమంలో ఇండియాకు వచ్చి 2012లో పెళ్లి చేసుకున్నాను. ముందే మా మిసెస్ అమ్మనాన్నకు చెప్పాను. కుదిరితే ఆస్ట్రేలియాలోనే.. లేదంటే ఇండియాకు వచ్చి సెటిల్ అవుతానని. విచిత్రం ఏందంటే వీసా విషయంలో కేసు వేసి గెలిచినవారు చాలా అరుదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత ఇండియా వెళ్లి రెస్టారెంట్ పెట్టాలనుకున్నాను. ఆ సమయంలోనే తర్వాత నేను వేసిన కేసు కోర్టులో ట్రయల్ కు వచ్చింది. ఇమ్మిగ్రేషన ఏజెంట్ తో కలిసి కోర్టుకు అటెండ్ అయ్యాను. అక్కడ జడ్జి పేరు తెలియగానే నువ్వు గెలుస్తావు పో అన్నాడు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్. జడ్జ్ నా బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేసిండు. రెండు మూడు ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పాను. వారంలో వీసా వాపస్ వస్తది అని జడ్జి సెలవిచ్చారు. ఆల్ ద బెస్ట్ చెప్పారు.

వారం తర్వాత శాశ్వత నివాసం కోసం అయినా, లేదంటే స్టూడెంట్స్ వీసా కోసమైనా దరఖాస్తు చేసుకో అని నాకు ఎంబసీ నుంచి 3 నెలలు టైం ఇచ్చారు. నేను ఇండియా వెళ్లాలనుకుంటన్నాను అని పనిచేసే రెస్టారెంట్ ఓనర్ కు చెప్పిన. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. నీకు స్పాన్సర్ షిప్ వీసా (457 వీసా) ఇప్పిస్తా అన్నాడాయన. దానికోసం ఐ.ఎల్.సి (చిన్న టెస్ట్ పాస్) కావాలి. దానికి చదవాలి. 2 వారాలు టైం ఉంది. జాబ్స్ మానేసి ఇంగ్లీష్ కోర్సు చదివాను. ఫైనల్ గా ఎగ్జామ్ రాసిన.  9 మార్కుల్లో 6 వస్తేనే పాస్. నాకు 6 మార్కులు వచ్చాయి. సక్సెస్ అయ్యాను.

అప్పుడే పెద్ద పాప మొదటి బర్త్ డే కోసమని ఇండియాకు వచ్చాను. 457 వీసా సాంక్షన్ అయింది అని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నల్లగొండలో ఇంట్లో అడుగు పెట్టగానే నాకు మెయిల్ వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. నెల రోజుల తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చాను. తర్వాత పాపకు, నా భార్యకు కు వీసా అప్లై చేశాను. వాళ్లకు 2 వారాల్లో వీసా వచ్చింది. జూన్ 2014లోవారిద్దరూ ఇక్కడకు వచ్చారు. తర్వాత పిఆర్. అప్లై చేశాను. మరో ఏడాదిలో పర్మినెంట్ వీసా వచ్చింది. మధ్యలో మా వైఫ్ ఇండియాకు ఒకటి రెండుసార్లు వెళ్లి వచ్చింది. నాకు, పెద్దపాపకు సిటిజన్ షిప్ కోసం అప్లై చేస్తే ఏడాదికి వచ్చింది. నా భార్య మాత్రం ఇండియన్ సిటిజన్ గానే ఉంటానంది. అందుకే ఆమెకు అప్లై చేయలేదు. చిన్న పాప ఇక్కడే పుట్టింది కాబట్టి ఆమెకు మా ఇద్దరి కంటే ముందే షిటిజన్ షిప్ వచ్చింది. పిఆర్ వచ్చిన తర్వాత జాబ్ పర్మినెంట్ అయింది. అప్పటి నుంచి వీక్లీ ఆఫ్ లు, సిక్ లీవ్స్, ఈఎల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సమస్యలన్నీ తీరి కొంచెం రిలాక్స్ అయ్యాను.

కుటుంబ నేపథ్యం ఇదీ…

parents at australia

మా నాన్న పేరు ఊట్కూరు నారాయణరెడ్డి, అమ్మ భాగ్యవతి. మేము ముగ్గురం.  అన్న, అక్క తర్వాత నేను. అన్న బిఎస్ఎన్ఎల్ లో జెటిఓ. అక్క ఇబ్రహింపట్నం డిగ్రీకాలేజీలో జువాలజీ లెక్చరర్. మా బాపు కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) నాయకుడు. మా ఊరు గిరకబాయి గూడెం. నల్లగొండను ఆనుకుని ఉంటది. నేను ఫస్ట్ క్లాస్ విజ్ఞాన్ జ్యోతి స్కూల్ లో చదివిన. 2 నుంచి 10 వరకు రవీంద్రనగర్ లో ఉండే రవీంద్ర హైస్కూల్ లో. ఇంటర్, డిగ్రీ నల్లగొండ కాలేజీలో చదివాను. డిగ్రీ ఎన్జీ (నాగార్జున ప్రభుత్వ డిగ్రీ) కాలేజీలో చదవాలనుకున్న. కానీ సీట్ రాలేదు.

టెన్త్ 1998 బ్యాచ్. 460 మార్కులు వచ్చినయి. టెన్త్ తర్వాత బైపిసి తీసుకుందామనుకున్న. కానీ మా బాపు ఎంపిసిలో చేర్పించిండు. అక్కడ మొదలైనయ్ నా కష్టాలు. నాకు మ్యాథ్స్ అస్సల్ రాదు. బైపిసి తీసుకుని ఉంటే నేను కచ్చితంగా డాక్టర్ అయ్యేవాడినే. మా బాపు దోస్తుల పిల్లలు ఎంపీసీ చదువుతున్నారని నన్ను అందులో చేర్పించిండు. డిగ్రీ అయిన తర్వాత ఎమ్మెస్సీ ఫిజిక్స్ రాస్తే సీట్ రాలేదు. అప్పుడు ఇంట్లో తిట్లు మొదలైనయ్. బలవంతంగా ఎంపీసి చదివించారని నేను వాదించేవాడిని. కానీ తిట్లు తప్పలేదు. స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంతో అసోసియేట్ అయి పనిచేసిన. పిజి కొట్టలేకపోయానని ఇంట్లో చిన్నచూపు నాలో కసి పెంచింది. మా బంధువుల అబ్బాయి ఒకడు విదేశాలకు వెళ్తుంటే సెండాఫ్ ఇవ్వడానికి మా డాడీ ఎయిర్ పోర్టుకు పోయిండు. ఇంటికొచ్చి నువ్వు కూడా ఫారెన్ పోరాదు అన్నడు. సరే అని… దిల్ సుఖ్ నగర్ లో హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ లో జాయిన్ అయిన. ముందు ఇంగ్లాండ్ పోవాలనుకున్న. వీసా టైట్ అన్నారు. తర్వాత ఐర్లాండ్ అనుకున్నా. మా ఫ్రెండ్ సలహాతో ఆస్ట్రేలియా వచ్చిన.

ఆస్ట్రేలియా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ …

ఇండియాతో పోలిస్తే ఆస్ట్రేలియా లైఫ్ వెరీ బ్యూటీఫుల్. ఇక్కడ నేను జెర్నీ అంతా ట్రైన్స్ లోనే… నేను రెండు జాబ్స్ చేస్తాను. ఒకటి ఫుల్ టైమ్. రెండోది పార్ట్ టైం. రెండు వర్కింగ్ ప్లేస్ లు 10 నిమిషాల దూరంలో ఒకటి, 15 నిమిషాల దూరంలోనే ఇంకోటి ఉన్నాయి. కోల్స్ సూపర్ మార్కెట్ లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు డ్యూటీ. ఇక్కడ గ్రోసరీ డిపార్ట్ మెంట్ లో సెకండ్ ఇన్ఛార్జి. తర్వాత సాయంత్రం హోటల్ సరోనా భవన్ లో 5 నుంచి  రాత్రి 10.30 వరకు. ఇక్కడ మేనేజర్ పోస్టు.

ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్. సిటిజన్ షిప్ ఇచ్చేటప్పుడే హిందూ మతాచారాలు వదులుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు సిటిజన్ షిప్ అంత ఈజీగా రావడంలేదు. గతంలో 9కి 6 మార్కులు రావాలి. కానీ ఇప్పుడు 8 కి పెంచారు. నా 13 ఏళ్ల జీవితంలో ఏనాడూ రేసిజం ఫేస్ చేయలేదు. కూల్ గానే పనిచేసుకుంటూ పోయాను. వయో వృద్ధులు మాత్రమే అక్కడక్కడ రేసిజం చూపుతుంటారు. ఇప్పటి జరేషన్ అలా లేరు. ను రేసిజం ఫేస్ చేయలేదు. ఒక ఆస్ట్రేలియన్ నాకు మంచి దోస్తు… క్రికెటర్ గిల్ క్రిస్ట్ సైన్ చేసిన క్యాప్ గిఫ్ట్ గా ఇచ్చాడు.  మీడియాలో మాత్రం చాలా ఎక్కువగా రేసిజం అన్నట్లు చూపుతారు. అది నిజం కాదు. ఇండియన్ ఫుడ్స్ అంటే తెల్లోళ్లకు చాలా ఇష్టం. మన రెస్టారెంట్ కు వచ్చి కుమ్మేస్తుంటరు. పిల్లలకు ఎథిక్స్ నేర్పిస్తారు. ప్రాక్టికల్ నాలేడ్జి ఎక్కువగా నేర్పిస్తారు. పిల్లలను, వృద్ధులను వేధించినట్లైతే ఫైన్ లు చాలా దారుణంగా ఉంటాయి.

ఇంట్లో నేను ఒక్కడినే జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ జూలకంటి వాహిని ప్రస్తుతం ఇంట్లోనే పిల్లల ఆలన చూస్తారు. ఆమె ఎంసిఎ చదివింది. జాబ్ చేయాలనుకుంటే చిన్నపాపను డే కేర్ లో వేసి చేయొచ్చు. కానీ మాకిష్టం లేదు. అలా చేస్తే పిల్లలు ఇండియన్ కల్చర్ అలవర్చుకోలేరు. పైగా తెలుగు భాష అసలే రాదు. ఇంగ్లీష్ అంటే ఎలాగైనా స్కూల్ లో నేర్చుకుంటారు. కానీ డే కేర్ లో వేస్తే తెలుగు అనేది రానే రాదు. అందుకోసమే వాహిని ఇంట్లోనే ఉంటుంది. చిన్న పాప స్కూల్ కు వెళ్లిన తర్వాత తను కూడా జాబ్ చేస్తదేమో. ఇప్పటికైతే… ఒక ఇల్లు తీసుకుని ఇక్కడే ఉండాలనుకుంటున్నాము. ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇండియాతో పోలిస్తే… ఇక్కడ హెల్త్, ఎడ్యూకేషన్, సెక్యూరిటీ బాగున్నాయి. పిల్లలు పెద్దయ్యే వరకైతే ఇక్కడే ఉందామనుకుంటున్నాను. ప్రస్తుతం పెద్ద పాప 3వ తరగతి చదువుతున్నది. జాబ్ లేకపోయినా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. పిల్లలకు ఫ్యూచర్ కూడా బాగుంటుది నా ఫీలింగ్. పిల్లలు డిగ్రీ చదివితే జాబ్ వస్తది. వర్రీ కావల్సిన అసవరం లేదు. ఫ్రీ హెల్త్ అందిస్తారు. పిల్లల చదువులయ్యే వరకైతే ఇక్కడే. తర్వాత ఇండియాకు రావడమా? ఇక్కడే ఉండడమా? అన్నది డిసైడ్ చేసుకుంటం.