జగిత్యాల టు దుబాయ్, నా 27 ఏళ్ల జెర్నీ : గల్ఫ్ వచ్చేవారికి నా సలహా ఇదే

0
109

మెట్ట రమేష్ చంద్ర జగిత్యాల బిడ్డ. 27 ఏళ్లుగా దుబాయ్ లో పనిచేస్తున్న ప్రవాస తెలంగాణీయుడు. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన ధీశాలి. ఆయన ఏ పరిస్థితుల్లో దుబాయ్ వెళ్లారు? ఆయన జీవిత అంతరాన్ని All Time Report వెబ్ సైట్ ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. రమేష్ చంద్ర చీకటి వెలుగుల జీవితాన్ని చదవండి… ఆయన మాటల్లోనే…

దుబాయ్ లో రమేష్ చంద్ర వర్కింగ్ ప్లేస్

నేను మెట్ట రమేష్ చంద్ర. షార్జాలో నివాసం ఉంటూ దుబాయ్ లో వర్క్ చేస్తున్నాను. మా సొంతూరు కరీంనగర్ జిల్లా జగిత్యాల (ఇప్పుడు జగిత్యాల జిల్లాకేంద్రం అయింది). పెరిగింది కరీంనగర్ టౌన్ లోని గురుద్వారలో. మా అమ్మ మెట్ట లక్ష్మి నర్సమ్మ, నాన్న మెట్ట ఆంజనేయులు. మా నాన్న పోచంపాడు ప్రాజెక్టు ల్యాండ్ రిహాబిలిటేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. 1978లో నాన్న, 1994లో అమ్మ మరణించారు. నాతోడబుట్టివాళ్లం మొత్తం ఆరుగురం. ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు, ఒక చెల్లెలు. నేను ఐదో వాడిని. ఉద్యోగ రిత్యా నాన్నకు పదే పదే ట్రాన్స్ఫర్స్ అవుతుండడంతో మా పెద్దమ్మతో నేను, చెల్లి ఉండి చదువుకున్నాం. గంజి స్కూల్ లో 7వ తరగతి వరకు చదువిన. తర్వాత నాన్నకు మా  సొంతూరు జగిత్యాల బదిలీ అయింది. దీంతో నేను అక్కడికి వెళ్లి   8నుంచి ఇంటర్ వరకు అక్కడే చదివాను. మానాన్న ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. మా ఇంటికి అప్పట్లో ఉర్దూ పత్రికలు వచ్చేవి. మాది కురుమ కులం. మా కులం విద్యాపరంగా ఇప్పటికీ అత్యంత వెనుకబడింది. డబ్బులున్నవారు అక్కడో ఇక్కడో ఉండొచ్చు కానీ చాలా బ్యాక్ వర్డ్.

మా అమ్మ నాన్న

1979లో టెన్త్ చదివేటప్పుడు పేపర్ లీకేజ్ అయి పెద్ద సంచనం సృష్టించింది. 1981 నుంచి 84 మధ్య నేను పాలిటెక్నిక్ చేశాను. అప్పటికే మానాన్న మరణించారు. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. ఇంట్లో అన్నను అడిగితే వద్దన్నాడు. నాన్న డిపార్ట్ మెంట్ లో అన్నకు ఉద్యోగం వచ్చింది. అన్న కూడా డిప్యూటీ తహశీల్దార్ గా రిటైర్ అయ్యారు. మావోయిస్టు గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు అప్పుడప్పుడు జగిత్యాలలో షెల్టర్ తీసుకునేవారు. మొన్నటి వరకు కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా చేసిన తుల ఉమ భర్త రాజేందర్ రావుతో పరిచయం ఉండేది. దీంతో నేను ఆకర్షితుడినయ్యాను. నాకు కుదిరినప్పుడల్లా  మావోయిస్టు పాటలు పాడుతూ ఉండేవాడిని. కెఎన్ఆర్ కళాశాల మైదానంలో చారిత్రాత్మక సభ  ‘జగిత్యాల జైత్రయాత్ర’లో నేను పాల్గొన్నాను. అప్పుడు వేదిక చుట్టుముట్టు మఫ్టీలో పోలీసులు వచ్చారు. సభలో వక్తల ప్రసంగాలను రికార్డు చేస్తూ కనబడ్డారు. దీంతో ఆ రికార్డింగ్ పరికరాలు గుంజుకుని ధ్వంసం చేశారు కార్యకర్తలు.

దుబాయ్ లో మా ఫ్యామిలీ

నేను డిప్లమా ఫస్ట్ ఇయర్ జహీరాబాద్ లో చదువుకున్నాను. జహీరాబాద్ ప్రాంతం అంతా ఎర్ర నేల. నేను అక్కడ చదివేరోజుల్లో నాకు పదే పదే కడుపునోప్సి వచ్చేది. దీంతో మొదటిసంవత్సరం వరకే అక్కడ చదివాను. సిద్దిపేటకు చెందినవారు చాలామంది జహీరాబాద్ పాలిటెక్నిక్ లో చదివేవారు.  నేను అప్పుడు నక్సలిజం జర్నల్స్ చదవడం, మిత్రులతో చదివించడం చేసేవాడిని. నేనంటే గిట్టని పోరగాళ్లు కొందరు నన్ను పట్టించేందుకు ట్రై చేశారు. అప్పుడే మా గురువు గోల్డ్ మెడలిస్ట్ రాములు గారు (రావుట్ల, సిద్దిపేట) నన్ను జహిరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో అని తీవ్రంగా వత్తిడి చేశారు. రాములు సార్ కూడా నక్సల్ సానుభూతిపరుడే. అప్పట్లో పిపి గంగారెడ్డిని పట్టుకుని నేను నిజామాబాద్  పాలిటెక్నిక్ కాలేజీకి మారిపోయాను. నిజామాబాద్ పాలిటెక్నిక్ లో  ఆర్ఎస్.యు, పిడిఎస్ యు ఉండేవి. కానీ రెండు యూనియన్లలో లోటుపాట్ల వల్ల నేను ఏ స్టూడెంట్ యూనియన్ లో చేరలేదు. వారికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి వైస్ ప్రసిడెంట్ గా 6 ఓట్లతో గెలిచాను. అప్పుడు నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. నేను వెనక్కు తగ్గలేదు.తర్వాత వారు నా జోలికేం రాలేదు.

ఫీల్డులో నేను

పాలిటెక్నిక్ పూర్తికాగానే ఉద్యోగవేట షురూ చేశాను. బల్హార్ష చంద్రాపూర్ కోల్ మైన్ లో పరీక్ష రాశాను. న్యూ మాజిరి మైన్ లో ఉద్యోగం వచ్చింది. మెకానికల్ ఫోర్ మెన్ షిప్ట్ ఇంచార్జిగా జాబ్ లో జాయిన్ అయ్యాను. అక్కడ ఏడాది మాత్రమే పనిచేశాను. అక్కడ విపరీతమైన డస్ట్. ఆ తర్వాత 1987 ఆరంభంలో ఉద్యోగం మానేసి జగిత్యాల వచ్చాను. అప్పుడే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. మే 10,1987లో వివాహం అయింది. మా మామ మెట్ట కిష్టయ్య, మున్సిపల్ డ్రైవర్. మానాన్న చిన్నప్పుడే మాట ఇచ్చారు. ఆయన కూతురు హేమలతను మా ఇంటి కోడలిగా చేసుకుంటానని… అందుకే ఆమెతో నా వివాహం అయింది. అప్పుడు హేమ ఎస్సెస్సీ పూర్తయి ఇంటర్ లో జాయిన్ అయింది.

మా ఇంట్లో

పెళ్లి తర్వాత 1988లో హైదరాబాద్ వచ్చాను. ఫ్రెండ్ సురేందర్ రావు ఆయనతోపాటు రాంనగర్ గుండులో కిరాయికి ఉండేవాడిని. డాలీ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాను. అది యుకే ప్రాడక్ట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం స్కూటర్ మీద తిరిగాను. ఎన్నో సిమెంట్ కంపెనీలకు వెళ్లాము. మార్కెటింగ్ ఒకే ఒక్క సంవత్సరంలో చాలా వ్యాపార లావాదేవీలు రావడం, గుజరాతీ వ్యాపారి జీవితంలో యస్వయం శక్తితో ఎదిగినంత ప్రభుత్వ సంబంధ కంపెనీల్లో ఉండదు అని చెప్పినా వినకుండా…  తర్వాత ఆల్విన్ వాచ్ కంపెనీలో పరీక్ష రాశాను. సెలక్ట్ అయ్యాను. జాబ్ వచ్చింది. 1989 డిసెంబరులో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు ఒక్కడినే ఉన్న నేను ఫ్యామిలీని హైదరాబాద్ తీసుకొచ్చాను. రాంనగర్ నుంచి లింగంపల్లి రామచంద్రపురం కు షిఫ్ట్ అయ్యాను. ఆల్విన్ లో సూపర్ వైజర్ గా పనిచేశాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సిఎం గా చంద్రబాబునాయుడు ఉన్నారు. 1994లో ఆల్విన్ మూసేస్తారని పిడుగు లాంటి వార్త వచ్చింది. అప్పట్లో దివంగత నేతలు నాయిని నర్సింహ్మారెడ్డి, టైగర్ నరేంద్ర కార్మిక సంఘాల నాయకులుగా ఉండేవారు. ఒక సందర్భంలో నేను టైగర్ నరేంద్రతో ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డాను.

మా ఇంటి దేవుడు కొమరెల్లి మల్లన్న స్వామి

ఆల్విన్ లో నేను సూపర్ వైజర్స్ వైస్ ప్రసిడెంట్ గా పోటీ చేసి కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ప్రకాష్ యాదవ్ అనే కాంగ్రెస్ లీడర్ నాకు ఆల్విన్ లో సపోర్ట్ చేసేవాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్న మూసివేత నిర్ణయంతో ఆల్విన్ కంపెనీలో పనిచేసేవారంతా చెల్లాచెదరైపోయారు. చాలామంది అమెరికా వెళ్లిపోయారు. కొందరు ఇక్కడే వేరే ఉద్యోగాలు చూసుకున్నారు. కొందరు వ్యాపారంలోకి దిగారు. నా పరిస్థితేంటో అర్థం కాలేదు. అప్పుడే షార్జాలో  మా చెల్లెలు ఉండేది. అక్కడే బావ పనిచేస్తుండేవాడు. ఛలో నేను ఆయనతో మాట్లాడిన. వెంటనే షార్జా విమానం ఎక్కేశాను.

27 ఏళ్లుగా అరబ్ లో జీవితం. షార్జాలో ఉండడం… దుబాయ్ లో కొలువు చేయడం ఇదే నా పని. దుబాయ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అందుకే చాలామంది దుబాయ్ లో జాబ్ చేస్తూ కూడా షార్జాలోనే ఉంటారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉన్నాయో షార్జా, దుబాయ్ అలా ఉంటాయి. అవి ఎమిరేట్స్. షార్జా వెళ్లగానే ఓషియన్ రబ్బర్ ఫ్యాక్టరీలో జాబ్ లో జాయిన్ అయ్యాను. 2002 నుంచి 2008 వరకు అందులో పనిచేశాను. అబుదాబిలో సేల్స్ ఉంటే ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేవాడిని. అందులో ఎక్కువ మంది కేరళవాళ్లు ఉండేవారు. నేను ఒక్కడినే తెలంగాణవాడిని.

తర్వాత రమాకాంత్ ఆంగ్లే అనే వ్యక్తి గోవా నుంచి ఎంపీ ఉండేవాడు. ఆయన సాయిబాబా భక్తుడు. రమ్మని చెప్తే వెళ్లాను. వాళ్లది అడినాన్ కంపెనీ. షార్జా లో ఉంది. జాయిన్ కావాలని కోరితే 2008లో వెళ్లాను. కానీ అక్కడ 6 నెలలే పనిచేశాను. అంతకముందు 2005లో ఇండియాకు వచ్చాను. హైదరాబాద్ రామంతపూర్ లో సర్వే ఆఫ్ ఇండియా ముందు బ్యాంక్ కాలనీలో ఇల్లు కొన్నాము. 2008లో (చాలా కాలం తర్వాత) అబ్బాయి పుట్టాడు. వాడు పుట్టిన ఏడాదే ఓసియన్ రబ్బర్ కంపెనీలో రిజైన్ చేశాను. తర్వాత సిఎంఎస్ ఫిల్టర్ కంపెనీలో చేశాను. అక్కడా ఏడాదే పనిచేశాను. తర్వాత బయటకొచ్చి పుజైరా రాక్ వూల్ (బండల్ని కరిగించి తీసే వూలు) కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అంతలో మేనేజ్ మెంట్ మారింది. తర్వాత నా వల్ల ఇబ్బంది అవుతుందనుకున్నవాళ్లు కొత్త మేనజ్ మెంట్ తో మిలాఖత్ అయి నాకు టెర్మినేషన్ లెటర్ ఇప్పించాడు. నేను ఛైర్మన్ దగ్గరకు వెళ్లి మాట్లాడిన. అప్పుడు వేరే కంపెనీలో జాబ్ దొరికే వరకు ప్లానింగ్ కమిటీ విసా క్యాన్సల్ కాకుండా ఆపుతామన్నారు. 13 నెలలు పట్టింది మళ్లీ జాబ్ రావడానికి. వేరే దగ్గర జాబ్ వచ్చింది. ఆ 13 నెలల కాలం ఇప్పటి వరకు నా ఉద్యోగ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పుడు నా ఫ్యామిలీ ఇండియాలోనే ఉండె.

తదనంతరం గలదారి బ్రదర్స్ అనే పెద్ద గ్రూప్ లో జాబ్ దొరికింది. 8 ఏళ్లు పనిచేశాను. ఒకప్పుడు మూడో పెద్ద గ్రూప్ అది. మొన్న కోవిడ్ స్టార్ట్ కాగానే నేనంటే గిట్టని ఒక వ్యక్తి నామీద కక్షగట్టాడు. Redundancy letter ఇప్పించాడు.  కంపెనీకి మంచి లాభాలు చూపించాను. కానీ కోవిడ్ లాక్ డౌన్ స్టార్ట్ కాగానే ఆ జాబ్ వదులుకోవాల్సి వచ్చింది. నేను ఎక్కడ పనిచేసినా… ఐదు రూపాయలు ఫ్రాడ్ చేయలేదు. తర్వాత 2 నెలలు వెతికిన జాబ్ కోసం. లాక్ డౌన్ సమయంలో… గుజరాతీ కంపెనీ.. ఓనర్ పిలిచాడు… నా ప్రొఫైల్ చూసిన ఆయన పెద్ద కంపెనీల్లో పనిచేశావు… ఆ రకమైన ఆఫర్ మేము ఇవ్వలేము అన్నాడు. కానీ జాబ్ మాత్రం ఇస్తామన్నారు. సెప్టెంబరు 2019లో జొమే ఇంజనీరింగ్ (jome engineering) కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే పది నెలలుగా పనిచేస్తున్నాను. కానీ నాలుగు నెలల కిందట వేరే జాబ్ చూసుకో అని మేనేజ్ మెంట్ చెప్పింది. కొత్త జాబ్ వచ్చే వరకు జీతం ఉండదు. కాకుంటే ట్రేడింగ్ చేస్తే కమిషన్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ జాబ్ వేటలో ఉన్నాను.

ఐటి మంత్రి అయిన తర్వాత తొలిసారి దుబాయ్ వచ్చిన కేటిఆర్ తో మేము

వయసు 60 ఏళ్లు దాటితే ఇక్కడ ప్రతి ఏటా వీసా రెనువల్ చేసుకోవాలి. ప్రస్తుతం నా ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. బాబు వయసు 14 ఏళ్లు. షార్జా ఇండియన్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. గతంలో వీసా పరిమితి 3 ఏళ్లకు ఉంటుండే. దాన్ని ఇప్పుడు 2 ఏళ్లకు చేశారు. సీనియర్లకు ఎక్కువ జీతాలు ఇచ్చి ఉంచుకునేబదులు జూనియర్లను తీసుకుని సీనియర్లను పంపించడం చేస్తున్నాయి ఇక్కడి కంపెనీలు కూడా. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసేవాళ్లు ఎన్నేళ్లయినా పనిచేసి ఇక్కడినుంచి తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ అమెరికాలో మాదిరిగా గ్రీన్ కార్డు ఇచ్చి పౌరసత్వం ఇవ్వరు. అయితే ఇక్కడ పనిచేసేవాళ్లకు నెటివిటీ ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందింది. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియదు. త్వరలో ఎక్స్ పో (ఎగ్జిబిషన్) స్టార్ట్ చేయబోతున్నారు. దానికోసమే హోటల్స్ కూడా కట్టారు. అవి సక్సెస్ కావాలంటే ఇక్కడ జనరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలని అని భావిస్తున్నారు. సిటిజన్ షిప్ లాంటిది ఇవ్వాలనేది ఒక వార్త. ఉద్యోగం చేయగలిగినంతసేపు ఇక్కడ చేసి తర్వాత ఇండియా వెళ్లిపోతాము. ఒకవేళ పౌరసత్వం ఇస్తే ఇక్కడే ఉండాలా? ఇండియా వెళ్లిపోవాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు.

ఈటల రాజేందర్ తో నేను, నా మిత్రులు

గల్ఫ్ దేశానికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఇండియాలో లెఫ్టిస్టుగా ఉన్న నేను ఇక్కడ కంప్లీట్ సాయిబాబా భక్తుడిగా మారిపోయాను. ఇండియాల ఉన్నప్పుడు భక్తి విషయంలో నేను చాలా పూర్. భక్తి భావన పెంపొందినందున ఒక మంచి జాగాలోకి నేను వచ్చాను అని సంతృప్తిగా ఉంది. గల్ఫ్ కార్మికుల సమస్యలపై తెలుగు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉమ్మడి అసెంబ్లీలో ఈటల రాజేందర్ ఫ్లోర్ లీడర్ అయినప్పుడు గల్ఫ్ తెలంగాణ వారి సమస్యలను 50 పేజీల లెటర్ రూపంలో ఇచ్చాను. అప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. 2005లో 5వేల మందిని సమీకరించి ఇక్కడ మీటింగ్ పెట్టాము. గల్ఫ్ లో ఉన్న వాళ్ల గురించి చంద్రబాబుకు, వైఎస్ కు కూడా లెటర్లు ఇచ్చాము. వాళ్లు కానీ, నేటి కేసిఆర్ కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు.

కేవలం సంపాదన కోసం గల్ఫ్ వెళ్లడము అనేది ఇకపై నష్టమే అని మాత్రం చెప్పగలను. ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చేవారికి నా విన్నపం ఏమంటే… అన్ని రకాల అవకాశాలు పుష్కలంగా ఉన్న మన రాష్ట్రంలోనే ఉపాధి వెతుక్కోవడం మంచిదని నేను చెబుతాను. గతంలో 20.. 25 ఏండ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి… ఇక్కడేదో సంపాదించుకోవచ్చు అని అనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని నా మనవి. గల్ఫ్ దేశాలకు వచ్చే నిరక్షరాస్యులు, అన్ స్కిల్డ్ లేబర్ మోసపోకుండా వారిని క్రమబద్ధీకరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సవరిస్తే బాగుంటుందని కోరుతున్నాను.