ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వరుసగా మూడవ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు సమీక్షించారు.
ఇండ్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయని, ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారని, రెస్క్యూ ఆపరేషన్ కోసం మూడు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అయితే ఇవాళ రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం తగ్గుతుందని వాతావరణ శాఖ చెప్పింది. నిరాటంకంగా కురుస్తున్న వానల వల్ల..రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అయోమయంగా తయారైంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్ భీకర వర్షం ధాటికి తల్లడిల్లింది. అందమైన నైనిటాల్‌లో సరస్సు ఉప్పొంగడంతో రోడ్లు అన్నీ నీట మునిగాయి.