ప్రగతిభవన్ ఎదుట ఉద్రిక్తత..50 మంది ఉపాధ్యాయుల అరెస్ట్

0
234

తెలంగాణలో కొద్దిరోజుల క్రితం ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. బదిలీల్లో భాగాంగా సర్కార్ తెచ్చిన జీవో 317 తలనొప్పిగా మారింది. బదిలీల్లో దంపతులకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ప్రగతిభవన్ ఎదుట నిరసన చేపట్టారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉపాధ్యాయులు ప్రగతిభవన్ ఎదుట నిరసన చేపట్టగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న 50 మంది టీచర్లను అరెస్టు చేశారు. మేమంతా అంతర్​ జిల్లా బాధితులం. 317 జీవో వల్ల భార్యాభర్తలను వేరే వేరే జిల్లాలకు బదిలీలు చేశారు. ఈ జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు బదిలీలు ఇవ్వడంతో మానసిక క్షోభకు గురవుతున్నాం. 19 జిల్లాల ఉపాధ్యాయ దంపతులను ఒకే చోట వేశారు. మా 13 జిల్లాలను బ్లాక్​ లిస్టులో పెట్టారు. మేము ఇక్కడికి గొడవ చేయాలని రాలేదు. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం అని బాధిత ఉపాధ్యాయ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇచ్చారని..మిగతా 13 జిల్లాలకు చెందిన తమకు మాత్రం వేర్వేరుచోట్ల కేటాయించారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సత్వరమే నిర్ణయం తీసుకోవాలని 13జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.