మోదీ నియోజకవర్గవైున వారణాసిలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. ఏకంగా ఆ స్కూలుకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఊహించని విధంగా వచ్చిన కరెంటూ బిల్లును చూసి పాఠశాల యాజమాన్యం షాక్ కు గురైంది. దీంతో విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోయిందని స్కూలు సిబ్బంది వాపోయారు.
అయితే ఈ నెల 7వ తేదీలోపు బిల్లు చెల్లించాలని, చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరించడం స్కూల్ సిబ్బందిని మరింత బాధించింది. ఈ విషయంపై ఉన్నతాధికారులను వివరణ కోరగా, సాఫ్ట్ వేర్ సమస్య కారణంగానే బిల్లింగ్ లో పొరపాటు జరిగిందని వెల్లడించారు. అయితే ఆ స్కూలుకు తప్పుడు కరెంటు బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి రీతిలో బిల్లులు వచ్చాయట.