కమలాపురంలో పాపాగ్ని నదిపై కూలిన వంతెన

A collapsed bridge over the Papagni River in Kamalapuram

0
114

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలింది. కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు రెండు రోజులుగా ప్రవహించడంతో వంతెన బాగా నాని నిన్న సాయంత్రం నుంచి కుంగుతూ వస్తోంది. ఏడు మీటర్లకు పైగా వంతెన కూలడంతో కిలోమీటర్‌ దూరంలో వాహనాలు నిలిపేశారు.

అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించడానికి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

1977లో నిర్మించిన వంతెన కావడంతో భారీ వర్షాల కారణంగా కూలిపోయినట్లు జాతీయ రహదారి ఈఈ ఓబుల్‌రెడ్డి తెలిపారు. అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో దిగువన ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాజంపేట మండలం పులపుత్తూరు, ఎగువ, దిగువ మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు, చొప్పావారిపల్లె, రామాపురాన్ని జల ఉద్ధృతి నిండా ముంచేసింది.