తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది చిన్నారులు జన్మిస్తున్నారని, పుట్టిన వెంటనే వారందరికీ ఆధార్ కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు.
రాష్ట్రంలో ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డులు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందచేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నేబర్ లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు.
ఆధార్, ఫోన్ల అనుసంధానంపై గురువారం బీఆర్‌కే భవన్‌లో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఐటీ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు జయేశ్‌రంజన్, రవిగుప్తా, పంచాయతీరాజ్, వైద్య శాఖల కార్యదర్శులు సందీప్ సుల్తానియా, రిజ్వి, పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు