ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు వీలు కల్పించే ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది. ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ నంబరు కోరేందుకు అధికారులను ఇది అనుమతిస్తుంది. ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్నవారి నుంచి ఆధార్‌ను సేకరించేందుకూ వీలు కల్పిస్తుంది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటుహక్కు ఉంటే గుర్తించి తొలగించేందుకు దోహదపడుతుంది.
తదనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950, 1951ల్లోని సెక్షన్లకు సవరణలు చేపట్టనున్నారు. ఎన్నికల సంస్కరణల పథంలో ఈ బిల్లు కీలకంగా మారనుంది. ఆధార్ నంబరు ఇవ్వలేకపోయినంత మాత్రాన ఏ ఒక్కరికీ ఓటుహక్కు నిరాకరించకూడదని తాజా బిల్లులోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ ధ్రువపత్రాలతో వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశమివ్వాలని సూచిస్తున్నాయి.