ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేసారు. సీఎం ఆఫీస్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలను ఎందుకు తొలగించారంటూ మాజీ సీఎం ఆతిశీ(Atishi Marlena) ఆరోపించారు. దీంతో బీజేపీ దళితుల వ్యతిరేఖ పార్టీగా మరోసారి రుజువైందని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలతో అధికార పక్ష నేతలు వారించడంతో సభలో కాస్త గందరగోళం తలెత్తింది. స్పీకర్ విజయేందర్ గుప్తా కలుగజేసుకొని దీనిని రాజకీయ వేదికగా చిత్రీకరించొద్దని విపక్షాలను మందలించారు. సభ సజావుగా సాగడం ఇష్టం లేక, సభలో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతోనే ఆప్ నేతలు ఉన్నట్లు కనిపిస్తుందని స్పీకర్ అన్నారు. సభను 15 నిమిషాల పాటు వాయిదా చేసారు.
ప్రధాని మోడీ(PM Modi) ఇచ్చిన హామీని తొలి కాబినెట్ సమావేశం లోపు అమలు చేస్తామని చేయలేకపోయింది బీజేపీ ప్రభుత్వం అని ఆతిశీ అన్నారు. మహిళా సమ్మాన్ యోజన(Mahila Samman Yojana) కింద ప్రతి మహిళకు అందిస్తామన్న రూ.2,500 ఆర్థిక సాయం ఇవ్వకుండా మాటతప్పిందని ఆమె ఆరోపించారు. ఖజానా ఖాళీగా ఉందన్న సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలకు సమాధానంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక సాకులు చెప్తున్నారని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ కోరారు. ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ తమ ప్రభుత్వ హయాంలో 30,000 కోట్ల నుండి 70,000 కోట్లకు పెరిగిందని ఆమె చెప్పారు. మార్చి 8 నాటికి ఢిల్లీలోని ప్రతి మహిళ ఖాతాలో మహిళా సమ్మాన్ యోజన మొదటి విడత డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు.
Delhi Assembly | కాగా, సమగ్రమైన ప్రణాళికలతో మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేఖా గుప్తా(Rekha Gupta) స్పష్టం చేశారు. ఆప్ ప్రభుత్వం పోతూపోతూ ఖాళీ ఖజానా అప్పగించి వెళ్లిందని, దీనిపై అధికారులతో సమీక్ష జరిపినట్లు సీఎం తెలిపారు. అలాగే అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను రేఖా గుప్తా తోసిపుచ్చారు. దేశాధిపతులైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి పెట్టొద్దా? జాతిపిత మహాత్మా గాంధీ ఫోటో పెట్టొద్దా? అని ప్రశ్నించారు. అంబేద్కర్, భగత్ సింగ్ ల ఫోటోలకు కూడా కార్యాలయంలో స్థానం ఉంటుందని అన్నారు. వారు ఆదర్శప్రాయులు అని సీఎం అన్నారు