అడయార్ అమ్మ వారు లేక నేటికీ సంవత్సరం పూర్తి!

0
104

చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌పర్సన్‌, ప్రముఖ వైద్యురాలు శాంత ఇకలేరు. క్యాన్సర్‌ రోగుల చికిత్సకే తన జీవితాన్ని అంకితం చేసిన వి.శాంత (93) మంగళవారం (19 జనవరి 2021) కన్నుమూశారు. ఆమె మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నోబెల్ గ్రహీతలు సర్‌ సీవీ రామన్‌, సుబ్రమణ్యన్‌ చంద్రశేఖర్‌ కుటుంబానికి చెందిన శాంత 1927 మార్చి 11న చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించారు. 1949లో మద్రాసు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 1955లో గైనకాలజీ, అబ్‌స్టెట్రిక్స్‌లో ఎండీ పూర్తి చేశారు. అనంతరం డాక్టర్‌ ముత్తులక్ష్మి రెడ్డి, ఆమె కుమారుడు కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఆమె చేరే సరికి అది కేవలం 12 పడకల చిన్న ఆసుపత్రి. అక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి దాని ఖ్యాతిని తీసుకెళ్లారామె. 67 ఏళ్లపాటు ఆసుపత్రిలో సేవలు అందించిన ఆమె.. 20 ఏళ్లు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. తుదిశ్వాస వరకూ వైద్య సేవలోనే గడిపిన మహోన్నత మానవతా మూర్తి వైద్యురాలు శాంతమ్మ…తన జీవితాన్ని పూర్తిగా క్యాన్సర్ రోగులు, పరిశోధనలకే అంకితం చేసిన శాంత అవివాహితగానే మిగిలిపోయారు.

1955లో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టిన ఆమె ఆరు దశాబ్దాలకు పైగా కీలకమైన శస్త్రచికిత్సలను పర్యవేక్షిస్తూ క్యాన్సర్ చికిత్సా పరిశోధనా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆ వ్యాధి ఎలాంటిది? మందులేని ఈ క్యాన్సర్ మహమ్మారిని ఎలా నయం చేయాలనే అంశాల పై లోతుగా అధ్యయనం చేశారు. ఇక క్యాన్సర్ చికిత్సకు సంబంధించి అధునాతన వైద్య సౌకర్యాలైన అల్ట్రా సోనోగ్రఫీ, కంప్యూటరైజ్డ్ బయోగ్రఫీలను 30 ఏళ్ల క్రితమే అడయార్ ఇనిస్టిట్యూట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే అత్యంత ఆధునిక పరికరాలు రేడియో థెరపీ విభాగాలను ఏర్పాటుచేశారు. అయితే ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చినా క్యాన్సర్ విషయంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని శాంత గ్రహించారు. వీటిని అధిగమించేందుకు క్లినికల్ రీసెర్చ్ బయోకెమిస్ట్రీ, ఇమ్యునాలజీ ట్యూమర్,
మైక్రో బయాలజీ తదితర పరిశోధనా కేంద్ర విభాగాలను ఏర్పాటు చేశారు. ఇక 1988-90 మధ్య ఇండియన్ ఆంకాలజీ సొసైటీకి అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె 2005 మార్చి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ సలహా కమిటీలో సభ్యురాలిగా కూడా సేవలందించడం విశేషం. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి శాంత చేసిన పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఆంకాలజీ పై ఎన్నో పుస్తకాలు రాసిన ఆమె జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని ఈ విషయంపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.

క్యాన్సర్‌పై పోరులో ఆమె చేసిన పరిశోధనలు, వైద్యరంగానికి చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆమెను అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. 1986లో పద్మశ్రీ, 2005లో రామన్‌ మెగసెసె, 2006లో పద్మభూషణ్‌, 2016లో పద్మవిభూషణ్‌ అవార్డులనూ అందుకున్నారు. 2005లో నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. 2005 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు క్యాన్సర్‌పై సలహాకమిటీ సభ్యురాలిగా ఉన్నారు. శాంత మృతికి సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. తమిళనాడు గవర్నర్‌, ముఖ్యమంత్రి ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.