మళ్లీ రిజిస్ట్రేషన్ చార్జీల మోత – భూముల విలువలు పెంచడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0
108

తెలంగాణ రాష్ట్రంలో ఏడాది గడవకముందే రెండోసారి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయించింది. మెరుపు వేగంతో రిజిస్ర్ర్టేషన్ ఛార్జీలు పెంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించడం ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టాలని సర్కారు యోచిస్తోంది.

అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు వ్యవసాయ భూముల మార్కెట్ విలువను 50శాతం మేరకు పెంచనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్ట్ మెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని ఏరియాల్లో మార్కెట్ వ్యాల్యూ భారీగా ఉన్నచోట అవసరమైన మేరకు సవరించేందుకు వెసులుబాటు కల్పించనుంది.

రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయమై నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్ విలువల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి చేసి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఛార్జీల పెంపు ప్రక్రియ అమలులోకి వచ్చేలా కార్యాచరణ చేపట్టారు. మార్కెట్ వ్యాల్యూ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపుపై గురువారం రిజిస్ట్రేషన్ శాఖ కీలకమైన సమావేశం నిర్వహించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి శేషాద్రి, సంయుక్త ఐజి.లు, జిల్లా రిజిస్ట్రార్లతో నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో ఏమేరకు మార్కెట్ వ్యాల్యూ సవరించాలన్నదానిపై కసరత్తు చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే చాన్స్ ఉందంటున్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం మార్కెట్ విలువల పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై దృష్టి సారించలేదు. కానీ గత ఏడాది జూలై 22వ తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు రుసుములను పెంచింది. దాదాపు 20శాతం మేరకు మార్కెట్ విలువలను సవరించింది. కానీ ఏడాది తిరగకముందే మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది.

వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం 75వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ రేట్ ను 50శాతానికి పెంచగా మధ్య శ్రేణి భూముల విలువను 40 శాతానికి, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30శాతం మేర పెంచింది. అలాగే ఖాళీ స్థలాల కనీస ధర చదరపు గజానికి 200 రూపాయలుగా నిర్ణయించింది. వీటి విలువ కూడా 50 శాతం, 40 శాతం, 30 శాతంగా పెంచింది. అపార్ట్ మెంట్ల ధరల్లో చదరపు అడుగు కనీస ధర వెయ్యిగా నిర్ణయించగా కనిష్టంగా 20 నుంచి గరిష్టంగా 30 శాతం పెంచారు. దీంతోపాటు స్టాంపు డ్యూటీ విలువ, రిజిస్ట్రేషన్ల రుసుం ను కూడా పెంచింది. మరి ఈసారి బాదుడు ఎలా ఉండనుందో అని జనాలు టెన్షన్ పడుతున్నారు.