కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయా రంగాలపై థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సమయంలోనే నేడు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో తమకు ఊరట కల్పిస్తారని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
వేతన జీవులు, మధ్యతరగతి, నిరుద్యోగులు.. బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపు, ఉద్యోగ కల్పనకు నిధులు, విద్య, ఆరోగ్య రంగంపై వరాలు.. ఇలా ఏ రకంగా ఊరట కల్పిస్తారో అని ఆయా వర్గాలు ఎదురుచూస్తుంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన బడ్జెట్‌ను జాగ్రత్తగా రూపొందిస్తేనే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం.
కరోనా కారణంగా వైద్యానికి చేసే ఖర్చు పెరగడం, పాఠశాలలు మూతపడి పిల్లల చదువులు దెబ్బతిన్న నేపథ్యంలో వీటి నుంచి బయటపడేందుకు ఆయా రంగాలకు కేటాయింపులు పెరగగలవని మధ్యతరగతి కోరుకుంటోంది. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం 189 దేశాల్లో భారత్ 17వ స్థానంలో నిలిచింది. 2017 జాతీయ ఆరోగ్య విధానం.. వైద్య రంగంపై ఖర్చు 2025 నాటికి జీడీపీలో 2.5శాతం ఉండాలని సూచించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రజా ఆరోగ్యంపై చేసే ఖర్చు జీడీపీలో 0.9 శాతం నుంచి కాస్త పెరిగింది. అయితే 2020-21లో అది జీడీపీలో 1.1.శాతం మాత్రమే ఉంది. ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో 40శాతం మంది ఈ సారి బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగానికి తగిన కేటాయింపులు ఉండాలని అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగ సమస్య వల్ల దేశంలో పేదరికం క్రమంగా పెరుగుతోంది. 2011లో 34 కోట్ల మందిగా ఉన్న పేదల సంఖ్య 2019లో గణనీయంగా దిగి వచ్చినా కరోనా దెబ్బకు 2020లో 13 కోట్ల 40 లక్షలకు చేరింది. కరోనా వల్ల కార్మికులు, కూలీలు స్వస్థలాలకు వలస వెళ్లగా.. పరిశ్రమలు, నిర్మాణ రంగం నిర్వహణ సరిగా సాగడం లేదు. అందుకే ఈ పరిస్థితుల మధ్య ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మధ్యతరగతి, వేతన జీవులు, నిరుద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు.