నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పై భూకబ్జా ఆరోపణలు

Allegations of land grabbing against nominated MLA Stephenson

0
112

ఉమ్మడి రాష్ట్రంలో నామినేటెడ్ ఎమ్మెల్యే అంటే ఎవరో ఒక అనామకుడు అనుకునే పరిస్థితి ఉండేది. ఆయన ఎక్కడుంటారో? ఏం చేస్తారో? ప్రజలతో కలుస్తారా? లేదా అనేది ఎవరికీ తెలియని విషయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించారు నామినేటెడ్ ఎమ్మెల్యే. ఆయనే స్టీఫెన్ సన్. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎవరు అనగానే ఠక్కున ఆయన పేరు గుర్తొస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ సీన్ ఉండేది కాదు. మన స్టీఫెన్ సన్ రెండుసార్లు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఐదేళ్ల కిందట ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ, అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు స్టీఫెన్ సన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటేయాలని కోరిన సందర్భంలో ఆయనకు డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి ఎసిబికి చిక్కారు. ఇందులో ఎవరి పాత్రలు ఎలా ఉన్నాయి అన్నది పక్కనపెడితే స్టీఫెన్ సన్ కు ఎనలేని పాపులారిటీ వచ్చింది. ఆయన పేరు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది.

తాజాగా మరో వివాదంతో స్టీఫెన్ సన్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. అదేమంటే భూకబ్జా చేశారంటూ ఆయన మీద పత్రికల్లో కథనాలు వచ్చాయి. వికారాబాద్ జిల్లా పూడూరులోని సర్వే నెంబరు 202లో తిప్పని నర్సింహులు కు 3.10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి 2015లో స్టీఫెన్ సన్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో 1.25 ఎకరాల భూమిని స్టీఫెన్ సన్ కుమార్తె జెస్సికా పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. మిగతా భూమి నర్సింహులు పేరిటే ఉంది. ఆ భూమిని స్టీఫెన్ సన్ కు విక్రయించాలంటూ కొంతకాలంగా నర్సింహులు పై వత్తిడి తీవ్రమైంది. దానికి ఆయన అంగీకరించలేదు. ఈలోగా ఉపాధి కోసం నర్సింహులు హైదరాబాద్ వెళ్లారు. జూన్ 8వ తేదీన స్టీఫెన్ సన్ మనుషులు తన భూమిని చదును చేసినట్లు తెలుసుకున్న నర్సింహులు తిరిగి ఊరికి వచ్చేశారు. వెంటనే జూన్ 9వ తేదీన చన్ గోలు పోలీస స్టేషన్ లో స్టీఫెన్ సన్ మీద ఫిర్యాదు చేశారు. స్టీఫెన్ సన్, ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కానీ పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితుడు మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. అంతేకాదు స్టీఫెన్ సన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎస్సై శ్రీశైలం మీడియాతో మాట్లాడుతూ భూ తగాదా విషయం తమ దృష్టికి వచ్చిందని ధృవీకరించారు.

తెలంగాణలో ఒకవైపు ఈటల రాజేందర్ మీద ఆరోపణలు రావడంతో ఏకంగా మంత్రి పదవినే తీసేసిన పరిస్థితుల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మీద వచ్చిన భూకబ్జా ఆరోపణలపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.