హైదరాబాద్: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సింగరేణి యాజమాన్యానికి గురువారం నోటీసు ఇచ్చింది. డిసెంబరు 9 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించినట్టు కార్మిక సంఘం నేతలు తెలిపారు.
కోల్ ఇండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణిలోని నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ప్రైవేటీకరణతో వారసత్వ ఉద్యోగాల్లో కోత, అర్జిత లాభాలు కనుమరుగవుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోయగూడెం బ్లాక్ -3, శ్రావణిపల్లి బొగ్గు గనులు, సత్తుపల్లి బ్లాక్ – 3, కల్యాణ్ ఖని బ్లాక్ – 6 ఈ గనులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో పాటు పలు డిమాండ్లను సంఘం లేవనెత్తింది. అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయస్సును 35 నుంచి 40కి పెంచాలని, ఏడాది నుంచి మెడికల్ బోర్డును నిర్వహించలేదని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, కార్మికుల అలియాస్ పేర్లను మార్చాలని డిమాండ్ చేసింది.
యైటింక్లైన్ కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కార్మికులు పలు నిర్ణయాలు తీసుకుున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటరావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లా కార్మిక సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.