తెలంగాణలో మరో కొత్త మండలం..ఏ జిల్లాలో అంటే?

0
92

తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక చోట్ల మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ప్రజల నుంచి తలెత్తడంతో మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎంఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక తాజాగా మరో కొత్త మండలం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇనుగుర్తి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు.

సోమవారం ప్రగతిభవన్‌లో వరంగల్‌ ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఇనుగుర్తి మండల ఏర్పాటును కోరుతూ సీఎంకు వినతిప్రతం ఇచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వారి సమక్షంలోనే తన నిర్ణయాన్ని వెల్లడించారు.