టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీ గూటికి పొంగులేటి!!

టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీ గూటికి పొంగులేటి!!

0
94

టీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ గూటికి చేరారు. జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించారు. అయితే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నికల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ చేరిన నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు. నామా ఎంపీగా గెలిచి జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించుకున్నారు. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో పట్టు నిలుపుకుంటున్నారు. ఆయనకీ త్వరలోనే కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారని ప్రచారం జోరుగానే జరుగుతోంది.

దీంతో జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పొంగులేటి సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనీ, ఆయనకి పార్టీ నుంచి ఏదో ఒక పదవో, గుర్తింపో ఉంటుందనే సంకేతాలూ లేవని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఏరకంగా చూసుకున్నా పొంగులేటికి టీఆర్ఎస్ లో అనూహ్యమైన గుర్తింపు లభిస్తుందనే వాతావరణం లేదనీ, అందుకే ఇప్పుడాయన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. పొంగులేటి చూపు ప్రస్తుతం బీజేపీ వైపు ఉందట. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తెలంగాణలో కూడా 4 ఎంపీ సీట్లు గెలిచి బలపడే దిశగా అడుగులు వేస్తుండటంతో ఆయన బీజేపీలో చేరాలి అనుకుంటున్నారట. ఇప్పటికే ఓసారి ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలతో పొంగులేటి భేటీ కూడా అయ్యారని తెలుస్తోంది. బీజేపీలో రాష్ట్ర నాయకత్వం కూడా పొంగులేటి చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొంగులేటి బీజేపీలో చేరితే ఖమ్మం జిల్లాలో పార్టీ బలపడే అవకాశముందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. దీన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే పొంగులేటి బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.