అట్టుడికిన ఏపీ..ఇవాళ రాష్ట్ర బంద్

0
102

తెదేపా కార్యాలయాలపై దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విశృంఖలంగా సాగవుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సోమవారం ఆరోపణలు చేయడంతో..నర్సీపట్నం పోలీసులు హుటాహుటిన గుంటూరు వచ్చి సోమవారం అర్ధరాత్రి ఆనంద్‌బాబు ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

ఈ పరిణామాలపై తెదేపా నాయకుడు పట్టాభిరామ్‌ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా, పోలీసులపైనా పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని పట్టాభిరామ్‌ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసి, బీభత్సం సృష్టించారు.

కాసేపటికి మంగళగిరి సమీపంలో డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గర్లో ఉన్న తెదేపా జాతీయ కార్యాలయంపై పదుల సంఖ్యలో దుండగులు విరుచుకుపడి విశృంఖలంగా దాడికి పాల్పడ్డారు. భయానక వాతావరణం సృష్టించారు. పార్టీ నాయకుడు దొరబాబుతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని ముందే పసిగట్టిన తెదేపా కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఇంత బీభత్సం జరుగుతున్నా పోలీసులు రాలేదు. చేయాల్సిన విధ్వంసమంతా చేసి, అల్లరిమూకలు తీరిగ్గా వాహనాలు ఎక్కి వెళ్లిపోయాక అప్పుడు పోలీసులు వచ్చారు.

తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరి మూకలు విరుచుకుపడ్డ సమయానికే..విశాఖ, నెల్లూరు, చిత్తూరు వంటి చోట్ల తెదేపా కార్యాలయాలపైనా, నేతలపైనా వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. కొన్ని చోట్ల తెదేపా నాయకుల చొక్కాలు చించేయడం వంటి ఘటనలు జరిగాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని వైకాపా నాయకులు ముట్టడించారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇంటి ముందు వైకాపా నేతలు ధర్నాకు దిగారు.

బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విశాఖ పర్యటన రద్దు చేసుకుని, రాత్రి 9 గంటల సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంపై దాడులకు నిరసనగా తెదేపా నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రెండు దఫాలుగా రాస్తారోకో చేశారు.