ఆర్టికల్‌ 370 అంటే..

ఆర్టికల్‌ 370 అంటే..

0
126

భారత రాజ్యాంగం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ రాష్ర్టానికి ఈ ఆర్టికల్‌ స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. రాజ్యాంగంలోని 21వ పార్ట్‌లో దీన్ని పొందుపరిచారు. ఆర్టికల్‌ 370 కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారు. దేశంలోని మిగితా రాష్ర్టాలకు రాజ్యాంగ ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తించవు. 1947లో షేక్‌ అబ్దుల్లా ఈ ఆర్టికల్‌ ముసాయిదాను తయారు చేశారు. రాజా హరిసింగ్‌, నెహ్రూ ఆదేశాల ప్రకారమే.. అబ్దుల్లా ఆర్టికల్‌ ముసాయిదాను రూపొందించారు. ఆర్టికల్‌ 370 ప్రకారం.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. మిగితా చట్టాల అమలు కోసం కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆ రాష్ట్రం ఓకే అంటేనే.. అప్పుడు పార్లమెంట్‌ మిగితా చట్టాలను అమలు చేస్తుంది. అంటే ఈ ఆర్టికల్‌ ప్రకారం.. కశ్మీర్‌ ప్రజలు ప్రత్యేక చట్టం కింద జీవిస్తారన్న విషయం అర్థమవుతోంది. పౌరసత్వం, ప్రాపర్టీ ఓనర్‌షిప్‌, ప్రాథమిక హక్కులు కూడా కశ్మీర్‌కు భిన్నంగా ఉంటాయి.

దీని ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్‌లో స్థిరాస్తులు కొనే అవకాశం ఉండదు. ఆర్టికల్‌ 370 ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు.

రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అయితే ప్రత్యేక చట్టాల అమలు కోసం తయారైన ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తున్నది. దాని కోసమే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ వాగ్దానం కూడా చేసింది. 2019లో తిరిగి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని మోదీ అన్నారు.