తెలంగాణ టిడిపికి కొత్త సారథి

0
129

తెలంగాణలో కొడిగట్టిన దీపంలా మారిన తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత కొత్త అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు ను నియమించారు.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ టిడిపిని నేలమట్టం చేసేందుకు టిఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఒక్కొక్కరుగా టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కారెక్కేశారు. తుదకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ చేరారు. ఇప్పుడు పార్టీ ప్రసిడెంట్ గా ఉన్న ఎల్ రమణ సైతం పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. ఒకవైపు టిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ఆకర్ష్ వలలు పట్టుకుని టిడిపి చేలలకు విసురుతూనే ఉన్నాయి.

దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మొత్తానికి మొత్తం ఖాళీ అయ్యే వాతావరణం నెలకొంది. ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నదంటే రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు, నన్నూరి నర్సిరెడ్డి లాంటి ఒకరిద్దరే ఉన్నారు. వారు కూడా యాక్టీవ్ గా లేనట్లు కనబడుతున్నది. ఈ పరిస్థితుల్లో మునిగిపోతున్న పడవను బక్కని నర్సింలు కు అప్పగించారు.

బక్కని నర్సింలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీలోనే కొనసాగారు. తనను నూతన అధ్యక్షుడిగా నియమించినందుకు బక్కని నర్సింలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనను అభినందించారు.