అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్ పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తన దురదృష్టకరం. బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు వేసుకుని రావడం వారి దురుద్దేశాన్ని చాటింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు సభలో గొడవ సృష్టించారు. మా అభివృద్ధి పథకాలను జీర్ణించుకోలేకే బీజేపీ ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేశారు. సస్పెండ్ నిబంధనల ప్రకారమే జరిగింది. బీజేపీ నేతలు సస్పెండ్ తర్వాత ఆందోళనలు నిర్వహిస్తూ డ్రామా చేస్తున్నారు. చట్ట సభల నుంచి ఎమ్మెల్యేల,ఎంపీ ల సస్పెన్షన్ కొత్త కాదు. బీజేపీ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇటీవలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసింది.
మహారాష్ట్రలో పన్నెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలను అక్కడి ప్రభుత్వం ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగమెష్ ను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హిమాచల్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయను అవమానపరిచారంటూ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గత సంవత్సరం సస్పెండ్ చేశారు. లోక్ సభలో కూడా 2017 లో 25 మంది కాంగ్రెస్ ఎంపీ లను సస్పెండ్ చేశారు. వ్యవసాయ చట్టాల సందర్భంగా కూడా రాజ్యసభ నుంచి ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా, బడ్జెట్ సందర్భంగా వెల్ లోకి వస్తే సస్పెండ్ చేయాలని బీఏసీ సమావేశంలో గతంలోనే నిర్ణయం జరిగింది. బీఏసీలో గత నిర్ణయం మేరకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
ఏమీ చేసినా చెల్లుతుందనే భావన బీజేపీకి సరికాదు. తెలంగాణ ప్రజలు బీజేపీ తీరును గమనిస్తున్నారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి. అసెంబ్లీ ముందు కాదు. బీజేపీ తన పెడ ధోరణులు మార్చుకుంటే మంచిది. లేకుంటే వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. అసెంబ్లీ లో రచ్చ కాదు చర్చ కావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ ప్రసంగం వినే ఓపిక కూడా లేదు. వాళ్ళు కూడా బీజేపీ ఎమ్మెల్యేల లాగా వ్యవహరించడం సరికాదు. ఇక నైనా కాంగ్రెస్ సభ్యులు హుందాగా వ్యవహరించి చర్చలో పాల్గొనాలి.
ఈటెల రాజేందర్ తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు. కిషన్ రెడ్డి పచ్చి తెలంగాణకు పచ్చి వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయారు. టీఆర్ఎస్ కు వీడ్కోలు బడ్జెట్ అని కిషన్ రెడ్డి మాట్లాడటం కాదు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను ఇప్పించాలి
.బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారని చురకలు అంటించారు.