హైదరాబాద్ హాట్ న్యూస్… అప్పుడు కాకరకాయ.. ఇప్పుడు కీకరకాయ : సెక్రటరీ ఇజ్జత్ తీసిన ప్రసిడెంట్

0
86

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ రాజకీయాలు ముదిరి పాకానపడ్డాయి. సొసైటీ సెక్రటరీపై ప్రసిడెంట్ రవీంద్రనాథ్ బొల్లినేని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ విషయమై అధ్యక్షులు జారీ చేసిన మీడియా ప్రకటన దిగువన యదాతదంగా ప్రచురిస్తున్నాం…

చదవక ముందు కాకరకాయ్‌.. చదివాక కీకరకాయ్ అన్నాట్ట వెనకటికొకడు. ఈ సామెత విద్యావేత్తగా గొప్పలు చెప్పుకునే మురళీ ముకుంద్‌కి అతికినట్టు సరిపోతుందేమో. ఎందుకంటే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. గత పాలకమండలి చేసిన అక్రమాలన్నీ తవ్వితీసి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రస్తుత పాలకమండలి సీరియస్‌గా ప్రయత్నం చేస్తుంటే.. కార్యదర్శిగా దానికి సపోర్ట్ చేయాల్సిన మురళీ ముకుంద్ రివర్స్ అయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడిపైన, ఇతర సభ్యులపైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆయన దృష్టిలో మేనేజింగ్ కమిటీ చేసిన తప్పేంటో తెలుసా..? పాత రికార్డులన్నీ పరిశీలిద్దాం వాటిని ఓసారి ఇమ్మని అడగడమట. ఇంతకంటే విచిత్రం ఎక్కడైనా చూస్తామా..! సొసైటీ కార్యదర్శిగా అడిగిన వివరాలు ఇవ్వడం, రికార్డులు పక్కాగా మెయింటెన్ చేయడమే కదా కార్యదర్శి పని..! అలాంటప్పుడు ఈ దబాయింపు ఎందుకు..! రికార్డులు పరిశీలించేందుకు పాత ఫైళ్లు ఇమ్మని కోరడం తప్పెలా అవుతుంది..? ఎవరి సపోర్ట్‌తో, ఏ అక్రమాలు దాచేందుకు ఆయన యూటర్న్‌ తీసుకున్నారనేది జూబ్లీహిల్స్ సర్కిల్స్‌లో బహిరంగ రహస్యమే. ‘ఓట్ ఫర్ ఛేంజ్’ అన్న నినాదంతో గెలిచి ఇప్పుడు ‘నాట్ ఫర్ ఛేంజ్‌’ అంటూ నరేంద్ర చౌదరి, హనుమంతరావులకే సపోర్ట్ చేసేలా ఆయన ప్రవర్తిస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది..! ఆయన ఎవరితో, ఎందుకు కుమ్మక్కయ్యారో త్వరలోనే పూర్తిగా బయటపడుతుందంటున్నారు..!!

జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, ఆఫీస్‌ బేరర్స్‌పై కేసులు పెట్టే వరకూ మురళీముకుంద్‌ వెళ్లడంతో.. పాలకమండలి కూడా చర్యలకు దిగింది. అరాచకాన్ని ఉపేక్షించేది లేదంటూ సభ్యులంతా కలిసి సెక్రటరీ విస్తృత అధికారాలకు కత్తెర వేస్తూ తీర్మానం చేసింది. 11 మంది సభ్యులు మురళీముకుంద్‌కు ఉద్వాసన పలికాలని గట్టిగా భావిస్తున్నారు. తన పరువు తానే తీసుకుంటూ, సొసైటీ పేరు కూడా చెడగొట్టేలా మురళీ వ్యవహరిస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి అనే మాట కూడా వస్తోంది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కొత్త పాలకమండలి మార్చిలో బాధ్యతలు చేపట్టింది. గతంలో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన నేపథ్యంలో వాటిని వెలికి తీసేందుకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంది. రికార్డులు, పక్కా ఆధారాలతో వాటిని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. ఎవరికో లాభం చేయడానికే మురళీ ముకుంద్‌ ప్రస్తుత పాలకమండలిని బద్నాం చేయాలని చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి సొసైటీ అధ్యక్షుడితోపాటు మిగతా సభ్యులూ మురళీ ముకుంద్‌ను గౌరవంగానే చూశారు. ఆ కారణంగానే కార్యదర్శి హోదాను సైతం కట్టబెట్టారు. ఇంత చేసినా కూడా అధికార యావ ఆయన్ను ఊరికే ఉండనివ్వలేదు. టీమ్ వర్క్‌గా ముందుకు సాగాల్సిన చోట ఏకఛత్రాధిపత్యం కోరుకున్నారు. రెండిళ్ల పూజారిలా అటు జూబ్లీహిల్స్ పబ్లిక్‌ స్కూల్ ఛైర్మన్‌గా, ఇటు సొసైటీ కార్యదర్శిగా సర్వం తన పెత్తనమే సాగాలనుకున్నారు. సొసైటీ ప్రెసిడెంట్‌ను సైతం లెక్కచేయని మూర్ఖత్వాన్ని, ఇగోను ప్రదర్శించారు. ఇదే సమయంలో నరేంద్ర చౌదరి, హనుమంతరావుకు సపోర్ట్ చేసేలా వాళ్లు ఆడమన్నట్టల్లా ఆడుతూ తన ఇమేజ్‌ను కూడా డ్యామేజ్ చేసుకున్నారు.

సొసైటీ బైలాస్ ప్రకారం రికార్డులన్నీ కార్యదర్శి దగ్గరే ఉంటాయి. ఉండాలి కూడా. దీన్ని ఎవరూ కాదనడం లేదు. ఆ రికార్డులు పరిశీలించడానికి ఇంకెవ్వరికీ హక్కు లేదని ఎదురు తిరగడంతోనే ఈ పేచీ అంతా. సొసైటీ కార్యదర్శిగా ఇప్పుడు మురళీముకుంద్‌ పోరాడాల్సింది గతంలో పలు రికార్డులు మాయం చేసిన వారితోనా..? లేదంటే ఆ అక్రమాల్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అధ్యక్షుడితోనా..? ఈ విషయంలో ఆయనకు క్లారిటీ ఉంటే ఈ గొడవలు, వివాదాలు ఉండనే ఉండవ్. కానీ బుద్ధి వక్రమార్గం పడితే ఎవరుమాత్రం ఏం చేయగలరు. ఇప్పటికే దొంగలకు సపోర్ట్ చేసేలాంటి చేష్టలతో తన పరువు తానే హుస్సేన్ సాగర్‌లో కలిపేసుకున్నారు. తెల్లచొక్కానిండా నల్ల మరకలు అంటించేసుకుంటున్నారు. తనకు తానుగానే మురళీముకుంద్‌ బురద గుంటలోకి వెళ్తూ.. పక్కవాళ్లకూ బురద అంటిస్తానంటుంటే, నమస్తే పెట్టి ఆయన్ను వదిలించుకోవడం తప్ప ఇంకేం చేయలగరు..! అందుకే కార్యదర్శిగా ఆయన అధికారాలకు కత్తెర వేశారు. నిజాయితీగా రికార్డులన్నీ పరిశీలించి ఆ ఇద్దరి అక్రమాల్ని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీ సెక్రటరీని ఆడిస్తోందెవరు..?
నవ్విపోదురుగాక నాటేకి సిగ్గు అన్నట్టు ప్రస్తుత అధ్యక్షుడిపైనే కేసులా..?
రికార్డులు ఇవ్వవయ్యా మురళీ అంటే ఏందీ రచ్చ..!
ఫైళ్లు ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనకున్నదెవరు..?
సెక్రెటరీగా అధికారాలకు కత్తెర పడ్డా మురళీ తీరు మారలేదా..!
మురళీ ముకుంద్‌కు వ్యతిరేకంగా 11 మంది సభ్యుల తీర్మానం
సొసైటీపై మొత్తం పెత్తనం మురళీ ఎందుకు కోరుకుంటున్నారు..?
నరేంద్ర చౌదరి, హనుమంతరావులతో ఉన్న లింకేంటి..!
ఎవరికి లాభం చేయాలని ఇదంతా చేస్తున్నారు..!
వందల కోట్ల అక్రమాలపై శ్వేతపత్రం ఇస్తామంటే ఏంటి నొప్పి..?
రికార్డ్‌ రూమ్‌కి పోలీసు భద్రత ఓవర్ యాక్షన్ కాదా..!
గత అక్రమాల్ని వెలికి తీయాల్సిన బాధ్యత కార్యదర్శికి లేదా..?