రేవంత్ రెడ్డి టీమ్ లో బిగ్ మైనస్ ఇదే : ఆ వర్గం నేతల్లో ఆవేదన

0
109

తెలంగాణలో కాంగ్రెస్ కొత్త సారధ్య బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం. ఆయనతోపాటు 19 మందితో జంబో టీం ను కూడా ప్రకటించేసింది. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ నింపి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భుజాల మీద పెట్టింది. దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నది రేవంత్ రెడ్డి టీమ్. కానీ రేవంత్ టీమ్ లో పెద్ద లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నది.. అదేమిటో చదవండి.

geeta reddy

సమాజంలో సగ భాగం మహిళలు… మహిళలకు అన్ని రంగాల్లో కుదిరితే 50 శాతం లేదంటే 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అన్నిచోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డితో పాటు ప్రకటించిన మొత్తం 19 మంది సభ్యుల్లో ఒకే ఒక్క మహిళా నేత ఉన్నారు. అది కూడా సీనియర్ నాయకురాలు జె గీతారెడ్డి. 19 మందిలో మహిళలకు ఇచ్చిన పర్సెంటేజ్ చూస్తే… 5శాతం మాత్రమే. ఈలెక్కన చూసినా మరో ఐదుగురు మహిళలకు చోటు దక్కాల్సి ఉండే. ఈ విషయాన్ని మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

konda surekha

ఒకప్పుడు కాంగ్రెస్ లో సునిలా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, కొండా సురేఖ లాంటి హేమాహేమీలైన నాయకురాళ్లు ఉండేవారు. వారు జిల్లాలకు జిల్లాలనే శాసించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వారంతా చెల్లాచెదరై పోయారు. కొండా సురేఖ పార్టీలోనే ఉన్నా… యాక్టీవ్ గా లేరు. అయితే ఉన్న కొద్దిగొప్ప సెకండరీ లీడర్ షిప్ ను పెంపొందించుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు కనబడడంలేదు. వారిలోంచైనా కొంతమందికి పదవులు ఇచ్చి ఉంటే వారి నుంచి కానీ… మహిళా లోకం నుంచి కానీ పెద్దగా విమర్శలు వచ్చేవి కావని అంటున్నారు.

seetakka with sonia gandhi

కేసిఆర్ తొలి కేబినెట్ లో ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరని ఇదే కాంగ్రెస్ నేతలు మొన్నటి వరకు ఆరోపించారు. తుదకు మహిళాభ్యున్నతి మంత్రిత్వ శాఖను సైతం అప్పట్లో తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు కేసిఆర్. దానిపై చాలాకాలమే విమర్శల వాన కురిసింది. తర్వాత రెండోసారి కేబినెట్ లో కేసిఆర్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి, అటు సత్యవతి రాథోడ్ కు ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు.

uttam padmavathi reddy

మరి ఒక మహిళా సారథ్యంలో నడుస్తున్న జాతీయ పార్టీలో 19 మంది సభ్యులను ప్రకటించినప్పుడు 50 శాతం మహిళలకు పదవులు ఇవ్వాలి.. అలా కాకపోయినా కనీసం 33 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో అంతమందమైనా మహిళా నేతలు పోస్టులు ఇవ్వాలి కదా? అని ఒక నాయకురాలు ప్రశ్నించారు. ఒకే ఒక్క నాయకురాలికి పదవి ఇవ్వడం వల్ల ఏం సంకేతాలు ఇస్తున్నట్లు అర్థం కావడంలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇంకా నయం కేసిఆర్ కేబినెట్ లో తుమ్మలకు మహిళా శాఖ మంత్రిపదవిని కట్టబెట్టినట్లు మా పార్టీలో మహిళా కాంగ్రెస్ పదివిని కూడా మగవాళ్లకు కట్టబెట్టలేదు… అదృష్టవశాత్తు అలాందేమీ జరగలేదు… మహిళా కాంగ్రెస్ పదవిని సునితారావు అనే మహిళా నేతకు అప్పగించి మంచి పనిచేశారు’’ అంటూ ఆమె తన ఆగ్రహాన్ని సెటైర్ రూపంలో ప్రదర్శించారు.

ravali reddy

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళా నేతలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వరంగల్ లో మాజీ మంత్రి కొండా సురేఖ, ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క, అదే జిల్లా నుంచి రవళి రెడ్డి, కరీంనగర్ కు చెందిన మాజీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారద, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కల్వ సుజాత, నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి లాంటి వాళ్లు అక్కడో ఇక్కడో ఉన్నారు. కానీ వారందరినీ పక్కనపడేశారు.

nerella sharada

ఈ విషయంలో ఇటు రేవంత్ రెడ్డి కానీ… అధిష్టానం కానీ పునరాలోచన చేయాలని మహిళా నేతలు కోరుతున్నారు. లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో టిఆర్ఎస్ పైన అయినా, బిజెపి పైన అయినా పోరాడేందుకు మహిళా శక్తిని కూడగట్టకపోతే పార్టీకి నష్టం తప్పదని అంటున్నారు. మరి పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.

kalva sujatha gupta