ఏపీ ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాకిచ్చింది.. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తంలో కోత పెట్టింది. దీంతో పాటు ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గించడంతో వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం కన్నా ఇప్పటికే వారు అధికంగా తీసుకున్నారని ప్రభుత్వం లెక్క తేలుస్తోంది. మున్ముందు ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్ -కరవు సాయం) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది. ఈ కారణాలతో దాదాపు రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు నష్టపోతున్న పింఛనుదార్లు కూడా ఉన్నారు.
కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెలువరించింది. పింఛనుదార్లకు కొత్త స్కేళ్లు… ఎంత మొత్తం పింఛను అందుతుంది… ఇప్పటికే అధికంగా ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని, డీఆర్ నుంచి ఎలా మినహాయిస్తారు వంటి అంశాలను జీవోల్లో పేర్కొంది.
పింఛనుదార్లకు ఉద్దేశించిన జీవో-2లో 19.3 నిబంధన ప్రకారం ఇప్పటికే అదనంగా చెల్లించిన మధ్యంతర భృతిని డీఆర్ బకాయిల మొత్తం నుంచి మినహాయిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ అలా మినహాయించినా ఇంకా సరిపోని పక్షంలో… ఆ పింఛనుదారు నుంచి ప్రభుత్వానికి ఇంకా జమ కావాల్సిన మొత్తం ఉంటే భవిష్యత్తులో ఇచ్చే డీఆర్ నుంచి మినహాయించుకుంటామని స్పష్టంచేసింది.
ఇదే జీవోలోని మరో పట్టికలో 75 ఏళ్లు దాటిన వారి పరిస్థితిని వివరించారు. పాత విధానంలో రూ.25,840 పాత మూల పింఛన్ ఉండి కొత్త మూల పింఛన్ రూ.39,682గా ఉన్న పింఛనుదారు రూ.1,07,170 ప్రభుత్వానికి బకాయి పడ్డారు. ఈయనకు భవిష్యత్తులో డీఆర్ అందదు.
70 ఏళ్ల వయసులోపు వారికి కొత్త లెక్కల ప్రకారం ఎంత బకాయి రానుందో లెక్కించారు. రూ.25,840 మూల పింఛన్ పొందేవారికి రూ.1,523 మేర బకాయిలు అందుతాయన్నారు.
80 నుంచి 85 ఏళ్ల మధ్య వారికీ ఇదే మూల పింఛన్ ఉంటే… వారికి రూ.41,251 పాత బకాయిల రూపంలో లభిస్తుంది.
85 నుంచి 90 ఏళ్ల మధ్య వారికి ఇదే మూల పింఛన్ ప్రకారం లెక్కిస్తే రూ.97,346 మేర బకాయిల రూపంలో అందుతుంది.
90 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఇదే మూల పింఛన్ ప్రకారం రూ.1,53,442 బకాయిగా అందుతుంది.
95-100 ఏళ్ల పైబడి వారికి ఇదే మూల పింఛన్ వద్ద 2,09,537 బకాయిగా అందుతుంది.
అదే 100 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.5,62,474 మేర బకాయిలు అందుతాయని పేర్కొంది.