బీజేపీ నాయకులవి బట్టేబాజ్ మాటలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

BJP leaders Battebaj words: Poem by MLC Kalwakuntla

0
73

తెలంగాణ: కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పని చేసే నాయకులకే మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మండల కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి 18 అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపనలు చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో భీమ్ గల్ పట్టణంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..ఏడేండ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందని, దీనికి సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమన్నారు. రాష్ట్రం కోసం ఎంత ప్రేమతో కొట్లాడినమో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అంతే చిత్తశుద్దితో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే, కొంత మంది రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు.

కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనటం సరికాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేవలం రాజకీయాల కొసం బట్టేబాజ్ మాటలు చెప్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పని చేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్న ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ ని రాష్ట్ర ప్రజలు రెండు సార్లు దీవించి ముఖ్యమంత్రిగా గెలిపించారని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్ గల్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, బాల్కొండను బంగారు బాల్కొండగా మార్చే భాద్యత మాదని ప్రకటించారు. భీంగల్ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని, భీంగల్ పట్టణంలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బిజెపి ,కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. భీమ్ గల్ ను మున్సిపాలిటిగా మార్చాలని ఎమ్మెల్సీ కవిత మంత్రి కేటీఆర్ ని కోరారని, భీమ్ గల్ మున్సిపాలిటీకి రూ.25 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.

భీమ్ గల్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత ముందుంగా వేల్పూర్ లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం భీమ్ గల్ మండల కేంద్రంలో కాలినడకన పర్యటించారు ఎమ్మెల్సీ కవిత. స్థానిక ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన ఎమ్మెల్సీ కవిత, ప్రజలతో ముచ్చటించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి భీమ్ గల్ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపన చేశారు.

భీమ్ గల్ పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం, మోర్తాడ్ – భీమ్ గల్ రోడ్డు వెడల్పు, LED సెంట్రల్ లైటింగ్, భీమ్ గల్ మున్సిపాలిటీలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ వెజ్& నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, కమ్మర్పల్లి – భీమ్గల్ రహదారి డబుల్ లేన్ నుండి నాలుగు లేన్లుగా విస్తరణ, భీమ్ గల్ – తుంపల్లి రహదారి విస్తరణ, ఇందల్వాయి – భీమ్గల్ రోడ్డు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, భీమ్గల్ – ముచ్కూర్ రహదారి నిర్మాణం, మదరస, నందిగల్లి, బోయిగల్లి, వాగు గడ్డ మొగిలి చెరువు స్మశాన వాటికల అభివృద్ధి, మొగిలి చెరువు ట్రీ పార్క్ మరియు బొర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ భవనం వద్ద ఓపెన్ జిమ్ ల ఏర్పాటు, భీమ్ గల్ మున్సిపాలిటీలో అర్బన్ పార్కు అభివృద్ధి పనుల నిర్మాణ పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం భీమ్ గల్ పట్టణ మహిళా సంఘాలకు రూ. 6 కోట్ల విలువైన రుణాల చెక్కులను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అందజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.