విమానానికి బాంబు బెదిరింపు

విమానానికి బాంబు బెదిరింపు

0
81

ముంబయి నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే లండన్ లోని స్టాన్ స్టెడ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దింపివేశారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ 191 విమానం గాల్లో ఉండగా విమానంలో బాంబులు అమర్చినట్టు బెదిరింపు సమాచారం అందింది. దాంతో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ టైఫూన్ జెట్ విమానాలు ఎయిరిండియా విమానాన్ని అనుసరించాయి.

ఆ విమానాన్ని స్టాన్ స్టెడ్ విమానాశ్రయం దిశగా దారిమళ్లించాయి. ఎయిరిండియా విమానం అత్యవసరంగా దిగిన తర్వాత దాన్ని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. పూర్తిగా తనిఖీలు చేసే సమయంలో రన్ వేపై ఇతర విమానాలను అనుమతించలేదు. విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదన్న విషయం నిర్ధారించాకే విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభించారు.