ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్లుగా ఉంది. రెండేళ్ళగా కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైంది.
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు, అర్హులందరికి ఇండ్లు అనే వాగ్దానాలకు గతిలేదుగాని, పిఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ళ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాధి అనడం హస్యాస్పదంగా వున్నది. ఒకవైపు మునుపు ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్ళు పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్నామని చెప్పిన కేంద్రం, ఆ ఫలాలను సామాన్యులకు అందించడంలో మొండి చెయ్యి చూపింది. కరోనాతో ఉపాధి ఉద్యోగులు కోల్పోయిన కోట్లాది మందికిమందికి ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో బడ్జెట్లో స్పష్టత లేదు. కరోనా కాలంలో ఏడాదిలో సంపదను రెండింతలు, మూడింతలు చేసుకున్న శతకోటీశ్వర్లపై సంపద పన్ను వేయకుండా విస్మరించడం దారుణం.
అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను కొనసాగిస్తూ త్వరలో ఎల్‌ఐసి ఐపివోను తీసుకవస్తామని ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరం. ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమించిన రైతుల ప్రధాన డిమాండ్ పంటలకు కనీసమద్దతు ధరపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం కర్షకులను కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఆదాయపు పన్నుల స్లాబులు పరిమితిని పెంచలేదు. అన్ని వర్గాల ప్రజల నడ్డివిరుస్తున్న పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించకపోవడం దురదృష్టకరం. దేశంలో ఎక్కడినుండైన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదన జాతీయ, అంతర్జాతీయ రియల్‌ఎస్టేట్ మాఫియాకు ఊతమిస్తున్నదని, ఇప్పటికే ఇలాంటి ప్రయోగం తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులకు గురిచేసింది.
తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమి అయ్యింది?
తెలంగాణలో ఒక సాగునీటి ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కుప్యాక్టరీ, తదితర విభజన హామీలను బడ్జెట్‌లో పేర్కొనకపోవడం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. కృష్ణా`గోదావరి ప్రాజెక్టుల అనుసంధానం పేరుతో రాష్ట్రాల ప్రాజెక్టులపై కేంద్రం తన పెత్తనాన్ని ప్రదర్శించే ప్రమాదం వున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాలు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేశాయి. మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణ దశలో వున్నాయి. వీటికి సంబంధించిన అంత్రాష్ట వివాదాలను కేంద్ర ప్రభుత్వం త్వరతగతిని నిష్పాక్షికంగా పరిష్కరిస్తే సరిపోతుందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.