కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సిఎం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలే విత్తన విక్రయాలు చేపట్టేలా ఈ నియంత్రణ చర్యలుండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రభుత్వ సర్టిఫైడ్ ముద్రిత విత్తనాల ప్యాకెట్ల మీద వుంటున్నందున, స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా విత్తన కంపెనీల పూర్తి వివరాలుంటాయని మంత్రి సిఎం కెసిఆర్ కు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు.
కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చవాకులు పేలినా, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తి చేసుకోగలిగామన్నారు. తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగిందన్నారు. అంకితభావంతో, రైతు సంక్షేమం వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్దితో,తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం వల్లనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగామని సిఎం అన్నారు.
వానాకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్ ను అందుబాటులోకి తేవాలని సిఎం అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి విత్తనాలు ఫెస్టిసైడ్లను అనుమతించిన కంపెనీల ద్వారా మాత్రమే విక్రయాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం జారీ చేసే క్యూ ఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సిఎం ఆదేశించారు.
విత్తనాలు ఫెస్టిసైడుల్లో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తూ, అవసరమైన చట్ట సవరణ చేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. జూన్ 15 నుంచి 25 వరకు రైతుబంధు ఆర్ధిక సాయాన్ని ఎప్పటిలాగే ఆయా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆర్ధిక శాఖ కార్యదర్శిని సిఎం ఆదేశించారు.
విత్తనాల లభ్యత :
ఇప్పటికే రోహిణీ కార్తె జొరబడినందున మరో వారం రోజుల్లో రుతుపవనాలు కూడా వస్తున్నందున, రైతులు వ్యవసాయానికి సిద్దమైతున్ననేపథ్యంలో రైతులకు విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆమేరకు తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. పత్తి కంది వరిధాన్యం విత్తనాలను కావాల్సినంత మేరకు సేకరించి రైతలకు అందించాలన్నారు. అదే సమయంలో కావాల్సినంత ఎరువులను ఫెస్టిసైడ్లను సిద్దం చేసుకోవాలని తెలిపారు.