తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాల తో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను., స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటూ వస్తున్నామన్నారు. భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని సిఎం తెలిపారు.
సమైక్యరాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను, వొక్కొక్కటిగా వోపికతో, దార్శనికతతో అవాంతరాలను లెక్కజేయకుండా సక్కదిద్దుకుంటూ వస్తున్నామని సిఎం అన్నారు. తెలంగాణ సమాజం.. తొంభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండివున్న నేపథ్యంలో.. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.
ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అన్నిటికీ మించి.. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళిని అర్పించాలనే స్పూర్తి వున్నదన్నారు.
వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతర వృత్తులతో పాటు, ఆసరా అందాల్సిన ప్రతివొక్క వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడిందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను వారికి అందిస్తూ, వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా మారిందన్నారు.
తెలంగాణ రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్ల అనతికాలంలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలపడం వెనక తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత ధీక్ష ఇమిడివున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించి, తెలంగాణ గ్రామీణ వ్యవస్థను ఆర్ధికంగా పరిపుష్టం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈ ఘన విజయంలో తెలంగాణ ప్రజల సహకారం మహా గొప్పదని, అందుకు వారికి సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా ఉపద్రవం వలన రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకు పోతున్నామని సిఎం అన్నారు. ప్రజలు తనమీద నిలిపిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమన్నారు. ప్రజలిచ్చిన భరోసాతో తెలంగాణను బంగారి తెలంగాణ గా తీర్చిదిద్దుకునే వరకు తాను విశ్రమించనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.