తెలంగాణ సిఎం కేసిఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. శనివారం ప్రగతి భవన్ లో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచిస్తూ… కల్తీ విత్తనాలు విక్రయించేవారిపై నర్సింహావతారం ఎత్తాలె… ఒక్కొక్కడి మీద పిడి యాక్ట్ పెట్టాలె అని స్ట్రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. మరిన్ని వివరాలు చదవండి.
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… విత్తనాల లభ్యత, ఎరువులు ఫెస్టిసైడ్ల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన అనే అంశం మీద సిఎం కెసిఆర్ చర్చించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ అదికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలని . కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీల తో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణమే జిల్లాల వారిగా పోలీసులను రంగంలోకి దించాలని డిజిపీ కి ఫోన్లో సిఎం ఆదేశించారు. నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సిఎం ఆదేశించారు.
‘‘ ఇగ మీరు నర్సింహావతారం ఎత్తాలె. దొరికినోన్ని దొరికినట్టే పట్టుకొని పిడీయాక్టు పెట్టాలె. ఇగ తెలంగాణ ల కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేటట్టు మీ చర్యలుండాలె. కల్తీ విత్తనాల మీద యుద్దం ప్రకటించాలె ’’ అని సిఎం ఆదేశించారు.
కల్తీవిత్తనాలతో రైతన్నకు తీరని నష్టం :
సన్న చిన్నకారు రైతు వొకటి రెండు ఎకరాలమీద ఆధారపడి కుటుంబాన్ని సాదుకుంటడని., అటువంటి రైతును కల్తీ విత్తనాలతో మోసం చేయడం అంటే దుర్మార్గమని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ కల్తీ విత్తనాలు కొని నాటేస్తే రైతు అన్నితీర్లా నష్టపోతడు. విత్తనం నాటి పంటను ఖర్చు చేసి పెంచుకోని తీరా కాతకాసే ముందు నిలబడి పోతే వూహించని పరిణామానికి గుండె బలిగి హతాశులైపోతరు..‘’ అని సిఎం అన్నారు. ఇందుకు కారణమయ్యే కల్తీ విత్తనదారులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని స్పష్టం చేశారు. డేగ కన్నుతో కనిపెడుతూ కల్తీ విత్తనదారులు తప్పించుకోలేని విధంగా చక్రవ్యూహం పన్నాలె విత్తనాలనే కాకుండా ఫెర్టిలైజర్లు కూడా కల్తీ కావడం దుర్మార్గం. బయో ఫెస్టిసైడ్ల పేరుతో రైతులను మోసం చేసే ముఠాలను కూడా పట్టుకోని పీడి యాక్టు పెట్టాలె..అని సిఎం తెలిపారు.