వరి కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు చేసిన మహాధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు పెంచే అంశం పరిశీలనలో ఉందని పేర్కొంది. గత రబీ సీజన్‌లో ఇచ్చిన హామీ మేరకు మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది.
‘ప్రస్తుతం దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకమీదట పారా బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాం. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. దేశ వ్యాప్తంగా వరి, గోధుమ పంటల దిగుబడి దేశీయ అవసరాలకు మించి జరుగుతోంది.
గోధుమ పండించే చాలా రాష్ట్రాల్లో వరి కూడా సాగు చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో వరి పండించినంతగా వినియోగం ఉండదు. అక్కడ 90% సేకరణకు కారణమిదే. తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ప్రజలు వరి వినియోగిస్తారు. తదుపరి రబీ సీజన్లో ఎంత కొంటామనేది రాష్ట్రాలో సమావేశం జరిపి, దిగుబడి అంచనాలను చూసి నిర్ణయం తీసుకుంటాం’ అని కేంద్రం స్పష్టం చేసింది.