తెలంగాణ: హుజూరాబాద్‌లో తెరాస కచ్చితంగా గెలుస్తుందని పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈటల కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. రేవంత్‌కు దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. కొంతకాలం తర్వాత ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని..వివేక్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని వినిపిస్తోందని తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా చెప్పారు.
కాంగ్రెస్‌లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని..కానీ కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదు, గట్టి అక్రమార్కులదే నడుస్తోందని ఆరోపించారు. మరోవైపు తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ 10 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ద్విదశాబ్ది వేడుకకు సన్నాహకాలు జరుగుతున్నాయన్న కేటీఆర్.. విజయగర్జన సభకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు తీసుకుంటామని వివరించారు. నవంబర్ 15న ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలను కోరారు. 20 రోజుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.