సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి వివరణ

0
97

సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.  లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఏపీలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లిన చినజీయర్​ స్వామి.. ఈ వివాదంపై స్పందించారు. ఆదివాసీ వనదేవతలను అవమానించారన్న దగ్గరి నుంచి… రాజకీయాల వరకు అన్ని అంశాలపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చారు  శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి.

తాము ఆదివాసీలను ఎప్పుడూ.. ఎవరినీ.. ఏమీ అనలేదని అన్నారు. 20 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదికి రావటానికి కారణం ఏంటనేది ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. సమతామూర్తి విగ్రహం నిర్వహణ కోసం టికెట్ పెట్టామే తప్ప.. పూజలు, ప్రసాదాలకు కాదని స్పష్టం చేశారు.

తమకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవని కావాలని వాళ్లు పెట్టుకుంటే ఏం చేయలేమన్నారు. మహిళలు, ఆదివాసీలను వెలుగులోకి తీసుకురావాలన్న భావన నుంచి వచ్చిన తాము వారిని అవమాన పరిచేలా ఎప్పుడూ మాట్లాడమని స్పష్టం చేశారు. రాజకీయాలకు చాలా దూరమని చెప్పారు.  మాంసాహారంపై గతంలో చెప్పిన మాటలను వివాదాస్పదం చేయడంపైనా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ రాసుకుపూసుకు తిరిగే మనస్తత్వం తమది కాదన్నారు చినజీయర్ స్వామి. కానీ ఏదైనా బాధ్యత తీసుకుంటే మాత్రం వంద శాతం నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.

“ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనేది వినే వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్లం కాబట్టి.. అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనిని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. అందరినీ ఆరాధించాల్సిన అవసరం లేదు. అందుకోసం మారనవసరం లేదు. మన పద్ధతిలో మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’ అని అనడం హాస్యాస్పదంగా ఉంటుందని అన్నారు.