కేసిఆర్ కొత్త పార్టీని ఆహ్వానించిన కమ్యూనిస్టు పార్టీ..

0
99

కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.  ముఖ్యంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ రాణించగలరా అన్న అంశంపై, జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయం వెనుక ఆయనకున్న ధైర్యం ఏంటన్న చర్చ  కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  తాజాగా కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీని పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ అన్నారు.

ఆయన త్వరలో దిల్లీకి మాకాం మార్చి కార్యకలాపాలను ప్రారంభిస్తారంటే మంచిదేనని శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అయితే రాజకీయ లక్ష్యం విషయంలో మాత్రం కేసీఆర్‌కు స్పష్టమైన వైఖరి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా ఉందని, రానున్న రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉన్న తరుణంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఒకరే అయితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండవని చెప్పారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ప్రతిపక్షాలతో మాట్లాడుతోందని, కేసీఆర్‌ కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతున్న క్రమంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చే రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి ఉందని పేర్కొన్నారు.  ఇది సాధ్యం కాని పక్షంలో ప్రయోజనం ఉండదని తెలిపారు. ఇక ఏపీ సీఎం జగన్‌తో ఇప్పటికీ కేసీఆర్‌ మాట్లాడలేదని, మించి మిత్రుడైన ఆయన్ను కూడా కలుపుకుని వెళ్లాల్సి ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాల కూటములన్ని కలవాలని, అధ్యక్ష ఎన్నికల్లో విడివిడిగా కాకుండా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలిపితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లేకపోతే దుష్పలితాలు తప్పవని హెచ్చరించారు.