కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మరి కాసేపట్లో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కాబోతోంది. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా పంజాబ్, చత్తీస్‌గఢ్‌లోని రాజకీయ పరిణామాలు, పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, సంస్థాగత ఎన్నికలు తదితర వాటిపై చర్చించనున్నారు.
ఇటీవల పంజాబ్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ అసమ్మతి నేతలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ తిరిగి ఆమె నుంచి బాధ్యతలు స్వీకరించాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించడానికి బదులు సంస్థాగత ఎన్నికలను పూర్తిస్థాయిలో నిర్వహించడమే మంచిదన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. అలాగే, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.