రేవంత్ రెడ్డికి పిసిసి : కేసిఆర్ కు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్

0
102

సుదీర్ఘ కసరత్తు, ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని ఎట్టకేలకు టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఛరిష్మా ఉన్న నాయకుడిగా ముద్రపడ్డారు. అటువంటి నేతకు పిసిసి ఇవ్వాలని పార్టీలో ఉన్న యువ కార్యకర్తలంతా కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డికి పిసిసి రావడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు. సొంత పార్టీ నేతల వ్యతిరేకత ఒకవైపు, టిఆర్ఎస్ నుంచి అడ్డుపుల్లలు మరోవైపు… ఇలా ఇంటా బయటా వచ్చిన వత్తిళ్లను తట్టుకుని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రేవంత్ రెడ్డికి పిసిసి కట్టబెట్టారు. ఇక్కడ టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఈ పరిణామం ఒకింత చేదుగానే అనిపించే అంశం.

రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ కానీయకుండా సిఎం కేసిఆర్ తనదైన శైలిలో చక్రం తిప్పినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. తనకు సన్నిహితంగా ఉండే కేవిపితో ఈ విషయంలో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా చేసినట్లు చెబుతున్నారు. అందుకోసమే పిసిసి చీఫ్ ఎంపికలో ఇంత ఆలస్యం జరిగిందని కూడా అంటున్నారు. ‘‘కేసిఆర్ కులమే కేవిపి రామచంద్రరావుది కాబట్టి ఆయనతో ఢిల్లీలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారని, కానీ అధిష్టానం వద్ద కేవిపి పప్పులు ఉడకలేదు’’ అని రేవంత్ రెడ్డి కీలక అనుచరుడు ఒకరు తెలిపారు. చివరి ప్రయత్నంగా తెలంగాణ పిసిసి పదవి రేవంత్ రెడ్డికి కాకుండా వేరెవరికైనా ఇస్తే రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్న ప్రతిపాదన కూడా గులాబీ బాస్ నుంచి అధిష్టానానికి చేరిందన్న చర్చ ఉంది. కానీ గతంలోనే తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పాడని గుర్తించిన అధిష్టానం కేసిఆర్ ప్రతిపాదనను పెడచెవిన పెట్టిందని సదరు రేవంత్ అనుచరుడు వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మొన్నటి వరకు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినందున కాంగ్రెస్ అధిష్టానం కేసిఆర్ ను లైట్ తీసుకుందని ఆయన వివరించారు.

తెలంగాణలో బిజెపి ఇప్పుడిప్పుడే పురి విప్పుతున్న తరుణంలో బిజెపిని ఎదుర్కొనేందుకు అవసరమైతే కాంగ్రెస్ తో కలవాలన్న ఆలోచన కూడా టిఆర్ఎస్ నేతల్లో ఉన్నట్లు కనబడుతున్నది. అందులో భాగంగానే ఏడేళ్లలో ఎన్నడూ లేనిది కాంగ్రెస్ శాసనసభా పక్షసభ్యులను కేసిఆర్ ప్రగతి భవన్ లోపలికి రానీయడం, వారు చెప్పగానే మరియమ్మ లాకప్ డెత్ విషయంలో వెంటనే పోలీసులపై యాక్షన్ తీసుకోవడం, మరియమ్మ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించడం లాంటివి చేశారని అంటున్నారు. బిజెపి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటే ఆ పార్టీని ఎదుర్కొనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకే ప్రగతిభవన్ లోకి కాంగ్రెస్ నేతల ఎంట్రీ అన్నది కూడా అంటున్నారు. సొంత పార్టీ నేతలకు, తుదకు మంత్రులకే ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఉండని పరిస్థితి ఉందని ఇటీవల ఈటల రాజేందర్ కామెంట్ చేసిన సందర్భం చూసినట్లైతే ఈ అంశం బోధపడక మానదు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ లో చాలామంది పెద్ద లీడర్లు సిఎం కేసిఆర్ తో అండర్ స్టాండింగ్ తో ఉన్నారన్న విమర్శలున్నాయి. వారంతా రేవంత్ రెడ్డికి పిసిసి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు గట్టిగానే చేసినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి కాకుండా ఎవరికి ఇచ్చినా ఒకే అన్నట్లు వారు అధిష్టానం మీద వత్తిడి తెచ్చారు. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది.

రేవంత్ కు ముళ్లబాటేనా?

రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కాకూడదు అని బలంగా కోరుకున్న కాంగ్రెస్ నేతలంతా రేపటినుంచి అసమ్మతి రాగం ఆలపించే అవకాశం ఉంది. వారంతా పార్టీని వీడొచ్చని అంటున్నారు. వారిలో ఎంతవరకు వీలైతే అంతమందిని పార్టీలోనే ఉండేలా చేసుకోవడం రేవంత్ రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యంగా చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పోతే వారి స్థానాన్ని భర్తీ చేసే నేతలను తయారు చేసుకోవడం కూడా రేవంత్ పై ఉన్న బాధ్యత గా చెప్పవచ్చు.

ఇక మరో కీలకమైన అంశం ఓటుకు నోటు కేసు. రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వగానే ఓటుకు నోటు కేసును తోడి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేయవచ్చు అన్న ప్రచారం ఉంది. ఈకేసులో ఇప్పటికే ఈడి ఛార్జి షీట్ దాఖలు చేసింది. ఏదోరకంగా ఈ కేసును తెరమీదకు తెచ్చి మళ్లీ అరెస్టు చేసినా చేయవచ్చన్న ప్రచారం ఉంది. దీన్ని ఎదుర్కోవడం కూడా రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములాంటిదే అంటున్నారు.

ఇక తెలంగాణలో కేసిఆర్ ను వ్యతిరేకించేవారంతా నేడు బిజెపి వైపు అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న నేతలు కేసిఆర్ ను ఢీకొట్టలేకపోతున్నారన్న భావనతోనే వారు బిజెపి వైపు ర్యాలీ అవుతున్నారు. కానీ వారందరినీ కాంగ్రెస్ వైపు రప్పించడం ఒక ఎత్తైతే… తెలంగాణలో బిజెపిని చెల్లాచెదరు చేయడం రేవంత్ రెడ్డి మీద ఉన్న మరో బరువైన పనిగా చెబుతున్నారు.

ఈ మూడు అంశాల్లో రేవంత్ రెడ్డి సక్సెస్ కావడం అనేది నల్లేరు పైన నడక కాదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తైతే ఇకనుంచి రేవంత్ రెడ్డికి ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివెల్ అవుతుందని కూడా చర్చ ఉంది.