తెలంగాణ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకుల సమావేశం ముగిసింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఉపాధ్యక్షులు, నాయకులు హర్కర వేణుగోపాల్, దీపక్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో డిజిటల్ మెంబెర్షిప్, రైతుల సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. రేపు 10 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై కాంగ్రెస్ ప్రతినిధుల బృందం, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేయనున్నారు.
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కలిసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తారు. మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పై అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల చేత ఫిర్యాదులు, భూ కబ్జాలు తదితర ఆరోపణలు నేపథ్యంలో ఆయన నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ బృందం కోరనుంది.
ఎల్లుండి ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు పెద్ద ఎత్తున రైతు ప్రదర్శన నిర్వహించనున్న కాంగ్రెస్. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కల అధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో ప్రదర్శన నిర్వహించి రాష్ట్రంలో వెంటనే ధాన్యం కొనుగోలు నిర్వహించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వనున్నారు.