కరోనా కొత్త వేరియంట్..తెలంగాణ ప్రభుత్వం అలర్ట్

Corona new variant..Telangana government alert

0
91
Harish Rao

కొవిడ్ కొత్త వేరియంట్లు, కరోనా మూడో దశపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ప్రజారోగ్య బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రేపు మరోసారి సమావేశం కానున్నారు.

కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కొత్త వేరియంట్ విజృంభణపై కేంద్రం రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్​కు ఫ్లయిట్స్ లేని కారణంగా ముంబయ్, దిల్లీలో దిగి… హైదరాబాద్ వచ్చే ప్రయాణికుల ట్రేసింగ్, టెస్టింగ్​కి సంబంధించిన అంశాలపై రేపు చర్చించనున్నారు.

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కరోనా వేరియంట్‌ను ‘బి.1.1.529’గా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోట్స్‌వానా, ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ కేసులు వెలుగు చూశాయి.

కొత్త వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌) వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్‌ను పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.