ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు ఏపీలోని నెల్లూరు జిల్లాకు రానున్నారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు జిల్లాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు వెంకటాచలం, నెల్లూరులో జరిగే పలు కార్యక్రమాల్గో ఆయన పాల్గొననున్నారు. ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వస్తారు.
అక్కడి నుంచి ప్రత్యేక రైలులో వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకుని..స్వర్ణభారత్ ట్రస్టుకు వెళతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరు గ్రామీణ మండల పరిధిలోని వీపీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.45 గంటలకు నెల్లూరు హరనాథపురంలోని రత్నం విద్యా సంస్థల అధినేత కేవీ రత్నాన్ని వెంకయ్యనాయుడు పరామర్శిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు స్వర్ణభారత్ ట్రస్టుకు తిరిగొచ్చి రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 9.30 గంటలకు చవటపాలెం పంచాయతీ పరిధిలోని దివ్యాంగుల కేంద్రాన్ని సందర్శిస్తారు.
ఉదయం 10 గంటలకు ట్రస్టుకు చేరుకుని తన అత్త కౌశల్యమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సదనాన్ని డీఆర్‌డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం సందర్శకులతో మాట్లాడుతారు. 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలిసి స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం అక్షర విద్యాలయ ప్రాంగణంలోని పర్ణశాలలో భోజనం చేసి..ప్రత్యేక రైలులో తిరుపతికి బయలుదేరి వెళతారు.