బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఎలిజబెత్- 2 మరణంతో బ్రిటన్ లో విషాధచాయలు అలముకున్నాయి. అయితే బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ఎంతో మంచి అనుంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాగా ఆమె ఇండియాలో 10 రోజుల పాటు పర్యటించారు. 1983 నవంబరులో రాణి ఎలిజబెత్ తన భర్త ఫిలిప్‌తో కలిసి 10 రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన రాణీ దంపతులకు బేగంపేట విమానాశ్రయంలో అప్పటి సమైక్య రాష్ట్ర గవర్నర్ రామ్‌లాల్, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో భాగంగా నగరంలోని అనేక ప్రాంతాలను ఎలిజబెత్ సందర్శించారు. తొలుత ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఇల్‌ను సందర్శించి అక్కడి ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి భారత మెట్ట పంటల పరిశోధనా కేంద్రం ఇక్రిశాట్‌కు వెళ్లి రెండున్నర గంటలపాటు గడిపారు.
ఆ తరువాత నేరుగా కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంతానికి వెళ్లారు. ఈ టూంబ్స్ నుంచే బైనాక్యులర్‌లో గోల్కొండ కోటను సందర్శించారు. నగరంలోని హోలీ ట్రినిటీ చర్చిని కూడా చూశారు. ఆ తర్వాత తిరిగి దిల్లీ వెళ్లిపోయారు.