అసంతృప్తితో ఎంపీటీసీలు..టీఆర్ఎస్ పార్టీకి ఊహించని చిక్కులు

Dissatisfied MPTCs..Us unexpected implications for the TRS party

0
105

తెలంగాణలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని చిక్కులు ఎదురుకానున్నాయి. తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తితో ఉన్నారు.

అసెంబ్లీ వేదికగా సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్న అసంతృప్తిని వెళ్లగక్కిన ఎంపీటీసీల సంఘం. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలియజేయడానికి కొన్ని డిమాండ్లను అధికార పార్టీ ముందు ఉంచారు. ఎంపీటీసీల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 15 వేలకు పెంచాలని, పంచాయతీ కార్యాలయాల్లో కనీసం కూర్చోడానికి గౌరవప్రదమైన స్థానం ఉండాలని, పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే అవకాశం కల్పించాలని ఇలా ఆరు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు.

ఈ నెల 16వ తేదీ కల్లా వీటిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని, లేని పక్షంలో తాము సొంత నిర్ణయం ప్రకారమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా ఆలోచిస్తామని సంఘం అధ్యక్షుడు కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికల ప్రక్రియ ముగిసేలోపు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 500 కోట్లను స్థానిక సంస్థలకు కేటాయిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ డబ్బులు విడుదల చేయలేదని గుర్తు చేశారు.

స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు వారి నిధులను జిల్లా, మండల పరిషత్తు ద్వారా స్థానిక సంస్థలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ఈ నెల16వ తేదీలోగా పరిష్కరించకపోతే తాము కూడా పోటీ చేయక తప్పదని, తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాల్సి వస్తుందని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసుకున్న విషయాన్ని మీడియాకు వివరించారు.