కొట్టేయడంలో మీరు పీహెచ్‌డీ చేశారంటూ టీడీపీ నాయకురాలు దివ్యవాణి, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజావేదికను హెరిటేజ్ సొమ్ముతో కట్టారా? అన్న విజయసాయి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇంటి ముందు 1.3 కి.మీ మేర రోడ్డు వేసేందుకు రూ.5 కోట్లను భారతి సిమెంట్స్ నుంచి ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు.
జగన్ ప్యాలెస్ వద్ద బారికేడ్ల నిర్మాణానికి రూ.75 లక్షలను కార్మెల్ ఏషియా చెల్లించిందా? అంటూ దివ్యవాణి విరుచుకు పడ్డారు. అలాగే జగన్ నివాసం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలను జగతి పబ్లికేషన్స్ నుంచి ఖర్చు చేశారా? అని నిలదీశారు. మీ రికార్డులు మీరే తిరగ రాస్తున్నారని, ఇక మిగిలింది గుడిలో లింగం మాత్రమేనని దివ్యవాణి తన పోస్టులో పేర్కొన్నారు.