రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో తెలుసా?

0
106

దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. జులై 18వ తేదీన పోలింగ్, జులై 21న ఫలితాల విడుదల, జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నిక అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. లోక్ సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉండి 35 ఏండ్లు నిండిన భారత పౌరులెవరైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు. అయితే వారు ఏ చట్టసభల్లో ప్రతినిధిగానూ, లాభదాయక పదవుల్లోనూ ఉండకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది.

దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు సంఖ్య 4,809 కాగా వారి ఓటు విలువ 10,86,431. ఎలక్టోరల్ కాలేజీలోని ప్రతి సభ్యుని ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఇది ఎంపీలకు ఒక విధంగా, ఎమ్మెల్యేలకు మరో విధంగా ఉంటుంది. లోక్ సభలో 543, రాజ్యసభలో 233 మందితో కలుపుకొని మొత్తం 776 మంది ఎంపీలున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం పార్లమెంట్ సభ్యులు (లోకసభ, రాజ్యసభ), దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు కలిసి రాష్ట్రపతిని సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు.  అసెంబ్లీల్లో నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఇక రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేల ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాని బట్టి నిర్ధారిస్తారు.

ఉత్తర ప్రదేశ్ లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208 ఉంటే, సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ 7 మాత్రమే. ఆంధ్ర ఎమ్మెల్యే విలువ 159, తెలంగాణ 132. మొత్తం 4033 మంది ఎమ్మెల్యేలు ఈసారి ఓటు వెయ్యబోతున్నారు. వీరందరి ఓటు విలువ కలిపితే కూడా రావాల్సింది, వచ్చేది కూడా 5,43,000. కౌంటింగ్ రౌండ్ల వారిగా చేసి, సగాని కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎన్నిక అయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న NDA కూటమికి 5,28,000 ఓట్లు ఉన్నాయి. వారికి ఇతర పార్టీల ఓటర్ల నుంచి కావల్సింది కేవలం 15,000 ఓట్లు. ప్రతిపక్షం బలంగా ఉండి, అధికార కూటమి నుంచి కూడా క్రాస్ ఓటింగ్ వేయించుకునే పరిస్థితి ఉంటే తప్ప, NDA అభ్యర్థి ఓడిపోయే అవకాశమే లేదు. దేశంలో ప్రస్థుత పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది? అధికార పక్షం బలంగా ఒకటిగా ఉంటే, ప్రతిపక్ష పార్టీలలో ఎవరు ఏ అభ్యర్థికి ఓటేస్తారో తెలియని పరిస్థితి. ఎన్నికలలో ఎలా గెలవాలని అనుక్షణం ఎత్తులు పై ఎత్తులు వేసే అధికార పార్టీకి ఈ ఎన్నిక కీలకం కానుంది. దేశంలో ఏ పార్టీ కూడా ఈ ఎన్నిక అడ్డుపెట్టుకొని అధికార పార్టీని బ్లాక్మెయిల్ కానీ, డిమాండ్లతో భయపెట్టే పరిస్థితి కానీ లేదు. ఈ వాస్తవాన్ని దాచి, రాష్ట్రపతి ఎన్నిక మీద ప్రాంతీయ రాజకీయం చేద్దాం అనుకోవటం దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్య రాజకీయం దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రలోనే ఉంది.