ఎవరీ ద్రౌపది ముర్ము? టీచర్ నుండి రాష్ట్రపతి అభ్యర్థిగా..

0
81

ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును అధికారికంగా ప్రకటించారు. అయితే మొదట బీజేపీ అభ్యర్థిగా ఎన్నో పేర్లు వినిపించాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఉన్నట్టుండి రేసులోకి జార్ఖంజ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము తెరపైకి వచ్చింది. చివరకు ఆమె పేరును ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. ఇప్పుడు అందరినోట ఎవరీ ద్రౌపది ముర్ము? అనే మాటే వినిపిస్తుంది. ఇంతకీ ఈమె ఎవరు రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం..

ఎవరీ ద్రౌపది ముర్ము?

ద్రౌపది ముర్ము గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. ఇలా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఇదే తొలిసారి. ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ము ఒక టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిత్వం వరకూ ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తి దాయకం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైదపోసిలో సంతాల్‌ గిరిజన తెగలో 1958 జూన్‌ 20న ద్రౌపది ముర్ము జన్మించారు.

1997 ఏడాదిలో బీజేపీలో చేరిన ద్రౌపది ముర్ము అదే ఏడాదిలో కౌన్సిలర్‌ అయ్యారు. తర్వాత 2000వ ఏడాదిలో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టర్మ్ లోనే ఆమెను మంత్రి పదవి వరించింది. 2000 – 02 వరకూ ఒడిశాలో రవాణా, వాణిజ్య మంత్రి అయ్యారు. బిజు జనతాదళ్ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె పని చేశారు. 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.

2004లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో 2002 నుంచి 2009 వరకూ మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.  2006 నుంచి 2009 వరకూ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగానూ ఉన్నారు. 2010లో మళ్లీ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలు అయ్యారు. మళ్లీ 2013 నుంచి 2015 వరకూ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.

2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఆమె ప నిచేశారు. ఝార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గా ఆమె నియమితులయ్యారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం. ద్రౌపది ముర్ము తన భర్త, ఇద్దరు కుమారులను ఓ ప్రమాదంలో కోల్పోయారు.. ముర్ము రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా కూడా కొంతకాలం పని చేశారు.