ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని..ఎన్నిక తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది.
హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను నిలిపివేయనున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.