తమ్ముడు తమ్ముడు అంటూనే తన భర్త ఈటల రాజేందర్ ను సిఎం కేసిఆర్ తడిబట్టతో గొంతు కోశారని ఆరోపించారు జమునారెడ్డి. తన తనయుడు నితిన్ రెడ్డితో కలిసి తమ నివాసంలో జమునారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారో చదవండి.
రావల్ కోల్ భూముల్లో లాజిస్టిక్ పార్క్ పెడతామని వారికి చెప్పే కొనుగోలు చేశాము. అప్పుడు వారికి తెలియదా? ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదు. మేము ఎకరం భూమి కొన్నా సరే వారికి చెప్పే కొన్నాము. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎక్కడా దోపిడీ చేయలేదు. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మమే నిలబడుతుంది. మా జమున హేచరీష్ భూముల్లో సర్వే చేయవద్దని మేము చెప్పలేదు. మా సమక్షంలో సర్వే చేయమని చెప్పాము. నేను పౌల్ట్రీ ని నడిపితేనే ఆనాడు ఈటల రాజేందర్ ఉద్యమం నడిపింది. ఆనాడు వంట వార్పు చేసింది.. ఉద్యమకారులకు అండగా నిలిచింది.
ఉద్యమం వదిలి రమ్మని ఆనాడు వైఎస్సార్ వెంట రావాలని అప్పటి దేవాదాయశాఖ మంత్రి రత్నాకర్ రావు చాలాసార్లు చెప్పారు… కానీ ఈటెల వెళ్ళలేదు. కేసీఆర్ మంచోడు కాదని వారు అప్పుడే చెప్పారు. రాష్ట్రం లో మంత్రులు కూడా మినిష్టర్ క్వార్టర్లో దొంగచాటుగా కలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తమ్ముడు తమ్ముడు అంటూనే కేసీఆర్ తడి బట్టతో గొంతు కోశారు. స్కెచ్ వేసి రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి భయ భ్రాంతులకు గురి చేశారు. కేసీఆర్ కి నీతి లదు.. న్యాయం లేదు.. ధర్మం లేదు.. ఆయన చెప్పింది రాత్రికి రాత్రి కావాలని అనుకుంటున్నారు.
సమైక్య పాలనలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. సమైక్య పాలనలో కులాలు చూడలేదు. కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నాం. నాకు అన్ని కులాలు సమానమే. తెలంగాణ వచ్చాక ఇప్పుడు సమాజాన్ని కులాలతో విభజన చేస్తున్నారు. అన్ని కులాల వారు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. అందరికి స్వేచ్ఛ కావాలి.. అందరూ ఆర్థికంగా ఎదగాలి. తెలంగాణ వచ్చాక అవమానాలు పెరిగాయి. సమైక్య పాలనలోనే సంతోషంగా ఉన్నాము. పౌల్ట్రీలు అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశాము. రెండు వేల కోళ్ల ఫారమ్ నుంచి 8 లక్షల కోళ్ల ఫాం స్థాయికి ఎదిగాం.
పోలీసులతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తే..భయపడేది లేదు. మా ఆస్తులు పోయినా.. కష్ట పడి సంపదిస్తా అనే ధైర్యం ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పనిచేస్తాం. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు నడవవు. జమున హ్యాచరిస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుంది. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం మాకు తెలుసు.