ఈటలను తిట్టిన వాళ్ళు రూట్ మార్చారు ఎందుకబ్బా?

0
117

ఈటల రాజేందర్ రాజకీయాల్లో వ్యక్తిత్వం కలిగిన నేతగా ఎదిగారు. పద్ధతి కలిగిన పొలిటీషియన్ గా మెలిగారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన ఈటల ఏనాడూ ఎవరిపైనా వ్యక్తిగత దూషణలు చేయలేదు. ఎవరినీ అగౌరవపరచలేదు.. కించపర్చలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే జెంటిల్మెన్ పొలిటీషియన్స్ జాబితాలో ఈటల కూడా ఒకరుగా చెప్పవచ్చు. అటువంటి ఈటలను కొందరు నిన్నటిదాకా తిట్టినవారు నేడు మెచ్చుకుంటున్నారు. ఆ కథేంటో చదవండి.

నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం… అందితే జుట్టు అందకపోతే కాళ్లు సామెతను ఒంటబట్టించుకోవడం, దందాలు, భూకబ్జాలు చేసి కోట్లు వెనకేయడం, ఏ రోటికాడ ఆ పాట పాడే రకాలు నేటి రాజకీయాల్లో ఎక్కువశాతం ఉన్నారు. ఆ జాబితాలోకి ఈటల ఎక్కలేదు. అయితే ఈటలను టిఆర్ఎస్ అధినేత, సిఎం కేసిఆర్ తొలుత ఆరోగ్య శాఖను కత్తిరించారు. భూకబ్జా ఆరోపణలు రావడం, విచారణ జరపడం చేస్తూనే తర్వాత మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఇక ఈటల ఎమ్మెల్యే పదవి కూడా పీకేస్తారని, ఆయనను, ఆయన కుటుంబాన్ని జైలుపాలు చేస్తారని లీకులు వచ్చాయి.

భూకబ్జా ఆరోపణలను అడ్డంపెట్టి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ ఇండిపెండెంట్ గా నే వ్యవహరించాలనుకున్నారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్రుడిగా బరిలోకి దిగాలని, కాంగ్రెస్, బిజెపి, టిడిపి, లెఫ్ట్ పార్టీలు, జన సమితి మద్దతు కూడగట్టి టిఆర్ఎస్ మీద మళ్లీ గెలవాలనుకున్నారు. ఇంతవరకు ఆయనపైన విమర్శలేమీ రాలేదు. కానీ ఆయా రాజకీయ పార్టీలు ఈటలకు పచ్చ జెండా ఊపలేదు. అప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఈటల బిజెపి వైపు చూడడం మొదలెట్టారు. అక్కడ మొదలైంది ఈటలపై దాడి. లెఫ్టిస్టువు రైట్ పార్టీలకు ఎట్ల పోతావు? ఆస్తుల రక్షణకు బిజెపిలోకి పోతున్నావా? ఆత్మరక్షణకు పోతున్నావా? ఇదేం నీచ రాజకీయం? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడతావా? బిసి అని చెప్పుకునే నువ్వు బిజెపిలోకి ఎలా పోతావు? సెక్యులర్ అయిన నువ్వు మతతత్వ పార్టీలోకి పోవుడేంది? సొంత పార్టీ ఎందుకు పెడతలేవు? కాంగ్రెస్ లకు పోవచ్చుగా? జన సమితి పార్టీలోకి పోవచ్చుగా? ఇలా విమర్శకులకు ఏది తోస్తే అది విమర్శలు గుప్పించారు. అలా ఈటల బిజెపిలోకి అంటూ వార్తలొచ్చిన నాటినుంచి మొదలుకొని… గన్ పార్కు వద్ద నివాళులు అర్పించి స్పీకర్ ఫార్మాట్ లో ఏకవాఖ్య రాజీనామా లేఖ రాసే వరకు గంటన్నరలో ఆ రాజీనామా ఆమోదం పొందేవరకు ఈ నోర్లన్నీ… మాట్లాడుతూనే ఉన్నాయి. రాజీనామా ఆమోదం పొందిన మరుక్షనం నుంచి ఈ నోర్లు మూతపడ్డాయి. కొత్త రాగం అందుకున్నాయి.

అదేమంటే… ఈటల గట్స్ ఉన్న లీడర్. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరాలంటే తనకున్న ఎమ్మెల్యే పదవిని, పార్టీ పదవికి రాజీనామా చేసి చేరుతున్నడు. ఇది ఈటలకు ఉన్న నైతికత. టిఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు లేని నైతికత. వారిని చేర్చుకున్న టిఆర్ఎస్ పెద్దలకు లేని నైతికత అంటూ ఈటలను తిట్టిన నోర్లే మెచ్చుకుంటున్నాయి. పార్టీ మారితే చచ్చినంత ఒట్టే అని ప్రమాణం చేసినవాళ్లు కూడా పదవులకు రాజీనామాలు చేయకుండా నిస్సిగ్గుగా పార్టీలు మారి ఓటేసిన జనాలను అవమానపరుస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నవేళ నైతిక విలువలకు కట్టుబడి ఈటల రాజీనామా చేయడం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్నది.

రేపు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు గాక కానీ రాజకీయాల్లో నైతికతను బతికించిన ఘనత మాత్రం ఈటలకు దక్కుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నడిబజారులో బరితెగించి అమ్ముడుపోతున్నవారు కొనుగోలు చేస్తున్నవారికి ఈటల రాజీనామా కాయితం చెంపపెట్టులాంటిదే అంటున్నారు నెటిజన్లు.