Flash News : అన్నా ఆ విషయంలో తప్పైంది.. క్షమించు : కేసిఆర్ కు ఈటల లేఖ, లీక్

0
92

తెలంగాణలో లీకేజీ లేఖల రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ బిజెపిలో చేరే సందర్భంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ రిలీజ్ అయింది. అది బిస్కెట్ లేఖ అని వెంటనే సోషల్ మీడియా హోరెత్తింది. దీంతో ఆ లేఖ గురించి అంతా గప్ చుప్ అయ్యారు. తాజాగా మరో లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ లేఖ ఎలా పుట్టిందో, ఎక్కడినుంచి లీకైందో తెలియదు. కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బదనాం చేయడం, కేసిఆర్ ను ఆకాశానికి ఎత్తడం అనే రెండు లక్ష్యాలను ఈ లేఖ కలిగి ఉందని లెటర్ ను చదివిన వారికి అర్థమవుతుంది. ఈ లీకైన తాడు లేదు బొంగరం లేదన్నట్లు… లేఖకు తేదీ లేదు. ఈటల రాజేందర్ సంతకం మాత్రం గ్రీన్ పెన్ తో ఉంది.

ఇక లేఖలో ప్రస్తావించిన అంశాలను చూస్తే… ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన తెల్లారి రాసినట్లు అనిపిస్తోంది. టివిల్లో ఈటలపై ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన కేసిఆర్ కు క్షమాపణ కోరుతూ లేఖ రాసినట్లు వివరణ చూస్తే అర్థమవుతున్నది.

ఈటల రాజేందర్.. కేసిఆర్ కు రాసిన లేఖ గా సర్యులేషన్ లో ఉన్న లేఖలో ప్రస్తావించిన అంశాలు యదాతదంగా కింద ప్రచురించాము. లేఖను సైతం ఆ దిగువన పోస్టు చేస్తున్నాం. చదవగలరు.

 

 

‘‘టిఆర్ఎస్ పార్టీలో గత 20 ఏళ్లుగా మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది. మీతో కలిసి పనిచేసిన ప్రతిక్షణం నేను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నాను. మీరు పార్టీలో నాకు స్థాయికి మించి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరిచ్చిన అవకాశంతో నేను హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా. నాకు అదే పెద్ద పదవి అనుకున్నాను. కానీ మీరు అప్పుడు ఆ సమయంలో ఎందరో మీతో సన్నిహితంగా ఉన్నవారిని కాదని నాకు ఏకంగా మన పార్టీ టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహాన్ని నేను మరచిపోలేను. ఉద్యమ సమయంలో నన్ను వేలుపట్టి నడిపించారు. నన్ను గత 20 ఏళ్ల నుంచి మీ తమ్ముడిలాగా భావిస్తూ వస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకుంటే నేను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నాకు రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చి పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చారు.

కానీ నిన్నటినుండి జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నిన్న నాపై ఆరోపణలతో కొన్ని ఛానెళ్లలో వార్తలు రావడం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. నేను చేసిన కొన్ని పనులు తప్పే కావొచ్చు. కానీ ఆ పనులు నేను కొందరు వ్యక్తులు తప్పుదోవపట్టించడం వల్ల చేయాల్సి వచ్చింది. కానీ పార్టీ మీద కానీ, మీ మీద కానీ నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది. బెంగుళూరులో కానీ, పూణేలో కానీ ఇతర చోట్ల నేను పెట్టిన సమావేశం కూడా కొందరి తప్పుడు మాటలతో నేను ముందుకు వెళ్లాల్సి వచ్చింది తప్పితే నాకు వేరే ఇతర ఆలోచన లేదు. అలా సమావేశాలు పెట్టడం పార్టీకి ఇబ్బంది కలిగించేలా కొన్ని రకాల పనులు చేయడం ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకుంటున్నాను. నన్ను మరోసారి పెద్ద మనసుతో మీ తమ్ముడిలా భావించి ఈ తప్పులను సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వగలరు. జరిగిన వాటి పట్ల నేను విచారం వ్యక్తం చేస్తూ… మీరు నన్ను పెద్ద మనుసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇక నుండి అలాంటి తప్పులు కానీ, పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేయనని మీకు మాటిస్తున్నాను.

నాతోపాటు పార్టీకి ఇబ్బంది కలిగించే అట్టి సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు కానీ, ఇతర జిల్లాల నాయకులు కానీ వారికి కూడా పార్టీకు విదేయంగా పనిచేసేలా చూస్తాను. మీరు నా తప్పులను సరిదిద్దుకోవడానికి ఈఒక్కసారి అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. పదవులతో సంబంధం లేకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి నేను అనుక్షణం సిద్ధంగా ఉంటాను. ఇదే విషయం నేను రామ్ తో అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను. ఆనాడు చెప్పిన దానికే ముమ్మాటికి కట్టుబడి ఉంటాను.’’