Home రాజకీయం రంగు మార్చిన ఈటల… దేనికి సంకేతమో ? | Etala Rajendar changed Twitter wall
మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గులాబీ రంగులకు తిలోదకాలు ఇచ్చేశారు. నిన్నమొన్నటి వరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన బొమ్మతోపాటు తన పార్టీ అధినేత కేసిఆర్ ఫొటో కనబడేది. వాల్ మొత్తం గులాబీ రంగుతో గుభాలించేది. కానీ ఇప్పుడువన్నీ మాయమై పోయాయి. ఈటల రాజేందర్ ట్విట్టర్ వాల్ మీద గులాబీ రంగు అనేదే కబడతలేదు. కేసిఆర్ బొమ్మ మచ్చుకు కూడా దొరుకుతలేదు.
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి అనూహ్యంగా బర్తరఫ్ చేశారు. అంతేకాకుండా ఈటల భూఅక్రమాలకు పాల్పడ్డారని ఆగమేఘాల మీద విచారణ కమిటీలు ఏర్పాటు చేసి ఈటల అవినీతిని యుద్ధ ప్రాతిపదికన వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ టిఆర్ఎస్ తో పూర్తి స్థాయిలో తెగతెంపులకు సిద్ధపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేసిఆర్ బొమ్మలు పీకి పడేశారు. గులాబీ రంగును వదిలేసి ఆకుపచ్చ రంగు వాల్ ను పెట్టారు. వాల్ మీద మహానీయులైన పూలే, అంబేద్కర్, తెలంగాణ జాతి పిత జయశంకర్ సార్ ఫొటోలను ఒకవైపు, తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం చిత్రాలు మరోవైపు పెట్టారు. మధ్యలో పిడికిలి బిగించిన చేతిని ఉంచారు.
దీన్నిబట్టి చూస్తే ‘‘సంధి లేదు మిత్రమా… సమరమే’’ అన్న ధోరణి ఈటల రాజేందర్ పెట్టిన చిత్రాన్ని చూస్తే అవగతమవుతున్నది. ఇక వాల్ మీద ఉన్న పూలే, అంబేద్కర్, జయశంకర్ సార్ చిత్రాలను పరిశీలిస్తే తెలంగాణలో పీడత వర్గాల రాజ్యం లేదు… దొరల రాజ్యం ఉందన్న భావనను కల్పించే రీతిలో ఈటల సమాజానికి సంకేతాలు పంపినట్లు తన సన్నిహితులు చెబుతున్నారు.
ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డ కారణంగానే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు టిఆర్ఎస్ వర్గాల నుంచి చెబుతున్న వాదన. కానీ ఆయనకంటే ఎక్కువగా టిఆర్స్ పార్టీలో భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. అంతెందుకు కేసిఆర్ కేబినెట్ లో ఉన్న అనేక మంది మంత్రుల మీద భూకబ్జా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మంత్రి మల్లారెడ్డి మీద భూకబ్జా ఆరోపణలే కాదు… ఆధారాలతో సహా బయటకొచ్చాయి. టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మల్లారెడ్డి భూకబ్జాలపై ఆధారాలను బయటపెట్టారు. కానీ వారి మీద ఈగ కూడా వాలడంలేదని అంటున్నారు.
మరీ విచిత్రం ఏమంటే ఈటల రాజేందర్ మీదనే కాకుండా ఈటల తనయుడు నితిన్ రెడ్డి మీద కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆరోపణలు వచ్చిన మరుక్షణమే ముఖ్యమంత్రి కేసిఆర్ విచారణకు ఆదేశించారు. కొమ్ములు తిరిగిన భూకబ్జాదారులను పట్టించుకోకుండా ఈటల రాజేందర్ ను ఒక్కడినే కబ్జాకోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఇక ఈటల కుటుంబంలో ఆయన భార్య జమునా రెడ్డి మీద కూడా ఏదో ఒక కేసు పెడతారేమో అని టిఆర్ఎస్ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు.