మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? పరిస్థితులు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టడం, కాంగ్రెస్ లో చేరడం, బిజెపిలో చేరడం కాకుండా ఆయన జెర్నీ కొత్త రూట్ లో సాగే చాన్స్ ఉందని కొందరు సన్నిహితులు చెబుతున్న మాట. ఆ వివరాలేంటో చదవండి.
తాజా పరిణామాలు చూస్తుంటే… శాసనసభ్యుడిగా ఈటల టిఆర్ఎస్ లోనే కొనసాగే చాన్స్ ఉందంటున్నారు. అలా టిఆర్ఎస్ రెబెల్ ఎమ్మెల్యే పాత్ర పోశిస్తారని సమాచారం. దాంతోపాటు ఒంటరిగా ఉంటే కేసిఆర్ ఏదో రకంగా ఈటలను ఉక్కిరిబిక్కిరి చాన్స్ ఉందన్న ప్రచారం ఒకవైపు ఈటల కూడా ఆ రకమైన సమాచారంతో ఉండడంతో ఆయన బిజెపికి అనుబంధంగా ఉండే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న మాట. రెబెల్ కల్చర్ టిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఒకదశలో టిఆర్ఎస్ పార్టీలో 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల సైన్యం ఉన్నది. రెబెల్ ఎమ్మెల్యేల్లో జగ్గారెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, ఎ చంద్రశేఖర్, బండారు శారా రాణి, దుగ్యాల శ్రీనివాసరావు లాంటివాళ్లు పొద్దున లేస్తే కేసిఆర్ ను చెడుగుడు ఆడుకునేవారు. అయితే అప్పట్లో సిఎం గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ మేరకు వీరు టిఆర్ఎస్ రెబెల్స్ పాత్ర పోశించారు. అదే తరహాలో ఈటల కూడా బిజెపికి అనుబంధంగా ఉంటూ… టిఆర్ఎస్ రెబెల్ ఎమ్మెల్యే పాత్ర పోశించే అవకాశం ఉందన్నమాట.
మరి అప్పట్లో అంటే టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి రెబెల్స్ ఆట నడిచింది… ఇప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉంది కదా? ఈటల అప్పటిలా నిలువగలరా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దీనికి కూడా ఇంకో వాదన వినబడుతున్నది. అప్పుడు టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా.. ఇప్పడు బిజెపి కేంద్రంలో ఉంది కాబట్టి బిజెపి అనుబంధంగా ఉండే పరిస్థితుల్లో ఈటలను ముట్టుకునే సాహసం కేసిఆర్ చేయకపోవచ్చని కూడా అంటున్నారు.
ఈటల రాజేందర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి ఇప్పట్లో రాజీనామా చేసే చాన్స్ లేదని ముందే చెప్పేశారు. కరోనా తగ్గిన తర్వాత తాను రాజీనామా చేస్తాననన్నారు. పరిస్థితి చూస్తుంటే కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు. పైగా మూడో వేవ్, నాలుగో వేవ్ అని చెబుతున్నారు. కేసిఆర్ వేట సీరియస్ నెస్ చూస్తుంటే తన రక్షణ కోసమైనా ఈటల రాజేందర్ బిజెపికి అనుబంధంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది.
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరతారని, ఆయనకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా ఇస్తారన్న ప్రచారం ఇప్పటికే షురూ అయింది. అయితే అది అంత ఈజీ కాదన్న వాదన కూడా మరోవైపు సాగుతున్నది. ఒకవేళ ఈటల రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఆయన సతీమణి జమునారెడ్డిని బరిలోకి దింపుతారని కూడా అంటున్నారు. కానీ ఈటల బిజెపికి వెళ్లి శాసనసభ సభ్యత్వం మాత్రం టిఆర్ఎస్ నే కొనసాగించడం ద్వారా కేసిఆర్ దాడుల నుంచి రక్షణ పొందవచ్చని అంటున్నారు. బిజెపి పంచన చేరిన ఈటలను ముట్టుకునే సాహసం కేసిఆర్ చేయకపోవచ్చని ఒకవేళ చేస్తే అప్పుడు కేసిఆర్ పై దర్యాప్తు సంస్థలను బిజెపి ఉసిగొల్పే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.