26లక్షలు తీసుకుని రైతుబంధును విమర్శిస్తావా? నీలో ఉన్న కమ్యూనిస్టు చనిపోయాడా?

0
107

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మాజీ ఉపముఖ్యమంత్రి, టిఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సూటి ప్రశ్నలు సంధించారు. వరంగల్ లో కడియం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు కింద 26 లక్షల రూపాయలను ఈటల కుటుంబం తీసుకుందని ఆరోపించారు. అలాంటి ఈటల నేడు రైతు బంధు పథకాన్ని వ్యతిరేకించడం తగునా అని ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ బీజేపీ లో చేరడం ఆయన వ్యక్తిగతం అయినప్పటికీ ఆయన వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయాడా…? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ లో ఏ మేరకు ప్రజాస్వామ్యం ఉందని మీకు అనిపించిందో చెప్పాలన్నారు.

పార్టీ అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడం ఏంటని ఈటలను నిలదీశారు. మీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ లో చేరారని అనిపిస్త్తోందన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమిటో చెప్పాలన్నారు. పేద ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా బీజేపీ దాడి చేసిందని తెలిసి కూడా బీజేపీ లో ఎలా చేరారో చెప్పాలన్నారు.

కేసీఆర్ పై మీరు వాడిన భాష సరిగా లేదన్నారు. .వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న మీరు ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం ఏంటన్నారు. 5 సం క్రితమే సీఎం తో మనస్పర్థలు వస్తే ఇప్పుడు మీకు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. దాదాపు 26 లక్షల రూపాయల రైతు బంధు తీసుకున్న మీరు రైతు బంధు గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారో చెప్పాలన్నారు. కేసులకు భయపడే మీరు బీజేపీ లో చేరారని తేలిపోయిందన్నారు. .బీజేపీ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న పార్టీ అని పునరుద్ఘాటించారు.